దుబ్బాక,సెప్టెంబర్5: దివ్యాంగులు, పింఛన్‌దారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక రజినీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన చేయూత పింఛన్‌దారుల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పింఛన్‌దారులకు ఆశ చూపి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విస్మరించారని విమర్శించారు.
దివ్యాంగులకు రూ.6 వేలు ,ఇతర పింఛన్‌దారులకు నెలకు రూ. 4 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. ప్రతి నెలా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వేతనాలు తీసుకోవడం తెలుసు కానీ నిరుపేద పింఛన్‌దారులు వారికి కనబడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా పింఛన్‌దారులకు ఒక్క రూపాయి పెంచలేదని మండిపడ్డారు. పింఛన్ సొమ్ము పెరిగేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రేవంత్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న చేయూత పింఛన్ దారుల మహాగర్జన సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో పింఛన్‌దారులు పాల్గొనాలని కోరారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మెదక్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ దండు శంకర్, ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా ఇన్చార్జి కుమార్, నాయకులు యాదగిరి, రాజు, పరశురామ్, ఎల్లం, జోగయ్య, స్వామి, రాజశేఖర్, కనకరాజు పాల్గొన్నారు.