జహీరాబాద్, ఫిబ్రవరి 10: జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 12500 ఎకరాల్లో నిమ్జ్ (జాతీయ పారిశ్రామిక మండలి)ను ఏర్పాటు చేసేందుకు వేగవంతంగా భూ సేకరణ చేస్తున్నది. నిమ్జ్‌లో రక్షణ రంగం కోసం పరికరాలు ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటు కోసం ఇటీవల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అలాగే, కొత్తగా మహీంద్రా అండ్ మహీంద్రా ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఒప్పందం చేసుకోవడంతో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కనున్నది. రూ.1000 కోట్లతో ఎలక్ట్రిక్ ప్లాంటు ఏర్పాటు చేస్తుండగా, సుమారు 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఒప్పందం
జహీరాబాద్ మహీంద్రా ఆండ్ మహీంద్రా ప్లాంట్‌లో ప్రస్తుతం ట్రాక్టర్లు, మినీ గూడ్స్, ఇతర వాహనాలు ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా రూ. 1000 కోట్ల పెట్టుబడితో లాస్ట్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ఒప్పందం చేసుకున్నది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాంటుకు అనుబంధంగా కొత్తగా ఈవీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు సమక్షంలో కంపెనీ
ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
1,000 కోట్లతో ఎలక్ట్రిక్ ప్లాంట్
ట్రాక్టర్ల తయారీ ప్లాంట్‌ను మరింత విస్తరించేందుకు రూ. 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు మహీంద్రా ప్రకటించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో మూడు, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేయనున్నట్లు, వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను కూడా ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త ప్లాంట్ తెలంగాణ ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీ
కార్యక్రమంలో ఈవీ క్లస్టర్లను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్‌కు అవసరమైన అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించనున్నది. కంపెనీ 65వ జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పాటు రైల్వేలైన్ అందుబాటులో ఉండడంతో ఇక్కడ తయారు చేసిన వాహనాలను దేశంలోని వివిధ రాష్ర్టాలకు సులువుగా తరలించేందుకు అవకాశం ఉంది. వాహనాలు ఉత్పత్తి చేసేందుకు కావల్సిన పరికరాలు అతి తక్కువ ఖర్చు, సమయంలో దిగుమతి చేసుకుని ఉత్తత్పిని పెంచుకునే అవకాశం ఉంది.
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
జహీరాబాద్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. మహీంద్రా ప్లాంట్‌లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది. వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
– ఎం.శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో కొత్త ప్లాంట్ ఏర్పాటవుతుండడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పుతుండడంతో స్థానికంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉంటాం.
–రాములునేత, మాజీ కౌన్సిలర్, జహీరాబాద్