జహీరాబాద్, మార్చి 14: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి మానవులు ఉపశమనం పొందడానికి ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని, వాటి పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కొత్తూర్ (బీ) విఠలేశ్వర దేవాలయంలో భక్తులకు ప్రవచనామృతాన్ని అందించారు. ఈనెల 10న బెల్లాపూర్ దత్తగిరి ఆశ్రమం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పల్లకి సేవ న్యాల్ కల్ మండలం హద్నూర్ దత్త గిరి ఆశ్రమం నుంచి ఉదయం బయలుదేరి న్యామతాబాద్ చౌరస్తా, గంగ్వార్, బంగ్లా మీర్జాపూర్, కొత్తూర్ (బి), బీదర్ క్రాస్ రోడ్ మీదుగా జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయానికి చేరుకుంది.
జహీరాబాద్ పట్టణంలో ఉత్సవ కమిటీ సభ్యులు అల్లాడి నర్సింలు, మంకాల్ సుభాష్, రాజయ్య బెజగం, సాయి రెడ్డి విట్టల్ రెడ్డి, నామ రవి కిరణ్ తదితరులు భక్తులు, ఆశ్రమ పీఠాధిపతులకు, ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రికి కైలాసగిరి దేవాలయంలో విశ్వ మానవ ధర్మ ప్రచారం, భజన సంకీర్తనలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు అవధూత గిరి, దేవగిరి, విశ్వ గిరి మహారాజ్లు, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.