ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో భారతీయ సాంస్కృతిక నాట్యశాస్త్ర పితామహుడు భరతముని ఆరాధనో త్సవాలు ( Bharata Muni Aradhanathosavas) శనివారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన స్వర మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.

హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు, కళాకారులు భరతమునిని స్మరించుకుంటూ భారతీయ శాస్త్రీయ నృత్య, సంగీత కళలను భక్తి భావంతో ప్రదర్శించారు. చిన్నారులు చేసిన లయాత్మక నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అన్నమయ్య సంకీర్తనలు, వేంకటేశ్వర స్వామి కీర్తనలు, శాస్త్రీయ సంగీత స్వరాలతో ఆశ్రమ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రతిధ్వనించింది.
ఈ కార్యక్రమంలో ధనశ్రీ మఠాధిపతి వీరేశ్వర శివాచార్య , రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాజయ్య స్వామి, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, గ్రామ సర్పంచ్ రాజు, హాజరై కళాకారులను సన్మానించారు. ప్రముఖ సంగీత కళాకారులు ఆదిత్య కిరణ్, నర్సింగ్ రావు తదితరులు వేడుకలను పర్యవేక్షించారు.