మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 15: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ శనివారం స్వగ్రామమైన మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని సందర్శించారు. ‘జయ జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తర్వాత తొలిసారి అందెశ్రీ రేబర్తి గ్రామానికి రావడంతో చిన్ననాటి స్నేహితులు, బంధువులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అందెశ్రీ గ్రామంలోని స్నేహితులు, బంధువుల ఇంటికెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలసుకున్నారు.
ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ చిల్పూరి భూపతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామంలోని పాఠశాలను సందర్శించి, పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే గ్రామాన్ని సందర్శించి ఆత్మీయులతో ప్రత్యేకంగా సమావేశమవుతానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మగాని శివయ్యగౌడ్, పంచాయతీ కార్యదర్శి మాధవ్జాదవ్, మాజీ ఉపసర్పంచ్ బొద్దుల చంద్రమౌళి, హెచ్ఎంలు వరదరాజులు, బస్వరాజు కనకయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.