మెదక్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని పశు వైద్యశాలల్లో మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదు. డాక్టర్ల కొరత, ఉన్నచోట సరైన సమయానికి రాకపోవడం, సీజనల్ వ్యాధులకు మందులు లేకపోవడంతో జిల్లాలో పశువులకు వైద్యం కరువైంది. దీంతో పశు పోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవారు. మేకలు, గొర్రెలు, పశువులకు నట్టల నివారణ మందులు అందించేవారు. 9 నెలల నుంచి జిల్లాలోని పశు వైద్యశాలలకు మందులు రావడం లేదు.
ఏటా నాలుగు సార్లు మందులు రావాల్సి ఉండగా, కొన్ని మాత్రమే వస్తుండడంతో అవి సరిపోవడం లేదని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. రెండేండ్ల నుంచి మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం లేదు. ఓవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతుండగా, మరోవైపు పశువైద్య కేంద్రాల్లో మందుల కొరత తీవ్రమవుతున్నది. ఏదైనా జబ్బు బారిన పడిన పశువులు లేదా జీవాలను పశు వైద్యశాలకు తీసుకెళ్తే డాక్టర్లు పరీక్షించి ప్రైవేట్‌లో మందులు తీసుకురావాలని చెప్పడంతో పెంపకందారులు అవాక్కవుతున్నారు.
వర్షాకాలంలో పశువులు గాలికుంటు, జబ్బవాపు, గొంతువాపు, జీవాలు గాలికుంటు రోగాలతో పాటు ఇతర వ్యాధుల బారిన పడుతున్నాయి. పశువులకు సోకుతున్న వ్యాధుల నివారణకు అవసరమయ్యే మందులు పశు వైద్యశాలల్లో అందుబాటులో లేకపోవడంతో పెంపకందారులకు ఇబ్బందిగా మారింది. పేరుకు మాత్రమే ప్రభుత్వ పశు వైద్యశాలలు ఉన్నాయని, మందుల కోసం ప్రైవేట్‌కు వెళ్లాళ్సిందేనని ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లాలో 67 పశువైద్యశాలలు
మెదక్ జిల్లాలో 67 పశు వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో 3 ఏడీ స్థాయిలో ఉండగా, 29 పీవీసీలు, 35 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ఏడీ స్థాయిలో ఉన్న వైద్య శాఖలలకు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. ప్రైమరీ వెటర్నరీ సెంటర్(పీవీసీ)లు 29 ఉండగా, ఇందులో 24 మంది డాక్టర్లు ఉండగా, నిజాంపేట, చేగుంట, పెద్దశంకరంపేట, యూసూప్పేట పీవీసీ సెంటర్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
35 సబ్ సెంటర్లు ఉండగా, 29 మంది డాక్టర్లు విధులు నిర్వర్తిస్తుండగా, టేక్మాల్ 2, కుసంగి 2, పాపన్నపేట చీకోడ్ 1, గడిపెద్దాపూర్ 1 ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పశువులకు సరైన వైద్యం అందక పశు పోషకులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం దవాఖానలకు తీసుకొచ్చే పశువులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేయడం మినహా వ్యాధుల నివారణకు అవసరమైన మందులు ఇవ్వలేకపోతున్నారు.
9 నెలలుగా మందులు లేవు…
గతేడాది అక్టోబర్‌లో మెదక్ జిల్లాలోని పశు వైద్యశాలలకు మందులు సరఫరా చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మందులు ప్రభుత్వం సరఫరా చేయలేదు. గతేడాది అక్టోబర్‌లో వచ్చిన అరకొర మందులతోనే పశు వైద్య కేంద్రాలను నడిపిస్తున్నారు. అక్కడ లేని మందులను ప్రైవేట్ దుకాణాల్లో తీసుకోవాలంటూ డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ప్రైవేట్ దుకాణాల నిర్వాహకులు అధిక ధరలకు మందులను విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని పశు పోషకులు వాపోతున్నారు. చివరి సారిగా రెండేండ్ల క్రితం జీవాలకు నట్టల నివారణ మందులు వచ్చాయి. మళ్లీ నేటి వరకు నట్టల నివారణ మందులు రాలేదు.
మందులకు ఇండెంట్ పెట్టాం
అన్ని రకాల మందుల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. రూ.42 లక్షలు బడ్జెట్ మంజూరైంది. వారం, పది రోజుల్లో జిల్లాకు అన్ని రకాల మందులు వచ్చే అవకాశం ఉంది. పశువులు, ఇతర జీవాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. పశు పోషకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– వెంకటయ్య, జిల్లా పశు వైద్యాధికారి, మెదక్
మెదక్ జిల్లాలో పశువుల వివరాలు
నల్లజాతి పశువులు :1,03,624
తెల్లజాతి పశువులు :48,999
గొర్రెలు : 4,45,576
మేకలు : 1,49,130