సంగారెడ్డి, జూలై 21: ప్రభుత్వం బీసీలకు అందించే ఆరిక్థ సాయం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, రేపటిలోగా దళితబంధు లబ్ధిదారుల జాబితా అందజేయాలని కలెక్టర్ శరత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28 లోగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పూర్తి కావాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిర్దేశించిన హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు శాఖల వారీగా సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ వంద శాతం జరగాలన్నారు. శాఖల వారీగా నాటిన మొక్కలకు సంబంధించిన ధ్రువీకరణతో జాబితా ఇవ్వాలని సూచించారు. ప్రతి మండలం, మున్సిపాలిటీలో దశాబ్ది వనాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠధామాల చుట్టూ బయో ఫెన్సింగ్ చేయాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. గొర్రెల యూనిట్ల రెండో విడత పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.
తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో ఓటరు జాబితా రూపకల్పన, ఫారం-6, 7, 8 డిస్పోజల్, ఈ రోల్ అప్డేషన్, ధరణి, జీవో 58, 59 దరఖాస్తుల పురోగతి, హౌస్ సైట్ డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వేలో ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫారం 6, 7, 8 కింద వచ్చిన దరఖాస్తులను ఈనెల 24లోగా ప్రాపర్‌గా డిస్పోజల్ చేయాలన్నారు.
ఓటరు జాబితా నుంచి తొలిగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరించి, పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుంచి తొలిగించిన ఓటర్ల వివరాలకు సంబంధించిన కారణాలను స్పష్టంగా తెలుపాలని సూచించారు. ఒకే ఇంట్లో ఆరు కన్నా అధికంగా ఉన్న ఓటర్ల వివరాలు ధ్రువీకరించుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ విషయమై పొలిటికల్ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, నిర్ధారించాలన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 ఓటర్లు దాటితే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ఓటరు కేంద్రాలను గుర్తించాలన్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వారంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 30లోగా ఇండ్ల పట్టాల పంపిణీ పూర్తి కావాలని, ఆ దిశగా గ్రామం, మండలాల వారీగా ప్రభుత్వ భూములు గుర్తించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో నగేశ్, ఆర్డీవోలు రవీందర్‌రెడ్డి, పాండు, వెంకారెడ్డి, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.