సంగారెడ్డి, జూన్ 26: సమాజానికి హానికరమైన మాదక ద్రవ్యాల చలామణిని అడ్డుకుందామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల సంక్షేమశాఖల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించి, ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ రూపేశ్ మా ట్లాడుతూ.. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమన్నారు. జిల్లా పోలీసు శాఖ D-NAB(జిల్లా నార్కోటిక్ అనాలసీస్ బ్యూరో) ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే D-NAB(జిల్లా నార్కోటిక్ అనాలసిస్ బ్యూరో)టోల్ ఫ్రీ నెంబర్ 8712 656777 కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ కమిషనర్ నవీన్ చంద్ర, డీడబ్ల్యూవో లలిత కుమారి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అల్లం రాజారెడ్డి, రత్నం, విద్యార్థులు పాల్గొన్నారు.