సిద్దిపేట, జనవరి 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తమ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చి 29న వీరి పదవీ కాలం ముగియనున్నది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తేదీల ప్రకారం ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 27 పోలింగ్, మార్చి 3న ఓట్ల తెక్కింపు జరుగుతుంది.
ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2019 ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండనున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం 15 కొత్త జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 271 మండలాలు, 43 శాసనసభ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. పీఆర్టీయూ అభ్యర్థిగా వంగ మహేందర్‌రెడ్డిని అధికారికంగా ప్రకటించడంతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇతర పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. ఆయా ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి.
ఉమ్మడి మెదక్‌లో 71,622 ఓట్లు
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టభద్రులు 64,701 మంది ఉన్నారు. వీరిలో 20,809 మంది మహిళలు, 43,892 మంది పురుషులు ఉన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 31,546 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 6,921 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,722 మంది మహిళలు, 4,197 మంది పురుషులు ఉన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలోనే ఉన్నారు. మొత్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కలిపి ఓటర్ల సంఖ్యను చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 71,622 మంది ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 71 మండలాలు ఉండగా, 102 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వీటిలో సిద్దిపేటలో 22 మండలాల్లో 40 పోలింగ్ కేంద్రాలు, మెదక్‌లో 21 మండలాల్లో 22 పోలింగ్ కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 28 మండలాల్లో 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.