జహీరాబాద్, డిసెంబర్ 13 : డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా అమ్మిన భూములు తిరిగి సభ్యులకే చెందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్ డీడీఎస్ వ్యవస్థాపక మాజీ డైరెక్టర్ గోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం జహీరాబాద్‌లోని ఐబీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. 1984 నుంచి 2024 వరకు నియోజవర్గంలోని 75 గ్రామాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, ఆ తర్వాత పస్తాపూర్‌లో డీడీఎస్ (ప్రాజెక్టు) సంస్థను ఏర్పాటు చేశారన్నారు.
ఆయా గ్రామాల పరిధిలో 5వేల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని, 43 గ్రామాల్లోని 2,600 ఎకరాల్లో మహిళా సంఘాల సభ్యులతో చిరుధాన్యాలు పండిస్తూ వాటిని కాపాడామన్నారు. డీడీఎస్ సంస్థలోని మహిళా సంఘాల సభ్యుల పిల్లలకు పౌష్టికాహారం కింద చిరుధాన్యాలను అందించినట్లు తెలిపారు. డీడీఎస్‌కు సంబంధించిన రూ. 45 లక్షలను బ్యాంకు డిపాజిట్ చేశామని, ప్రస్తుతం డీడీఎస్ అధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు. నెదర్లాండ్ నుంచి వచ్చిన విరాళంతో 23 గ్రామాల్లో 123 ఎకరాల భూమిని కోనుగోలు చేశామన్నారు.
డీడీఎస్ సంస్థలకు 75శాతం, మహిళా సంఘాల సభ్యులకు 25 శాతం వాటాతో ఆ భూములను కొనుగోలు చేశామని, అప్పట్లో కొనుగోలు చేసిన భూములను సంఘం సభ్యుల పేరిట ఉంటాయని చెప్పడం జరిగిందన్నారు. సంఘం సభ్యులకు తెలియకుండానే 74 ఎకరాల భూమిని హైదరాబాద్‌కు చెందిన వారికి అమ్మారన్నారు. 1984 నుంచి 2019 వరకు సంఘంలో ఉన్న సభ్యుల ఒక్కొక్కరి పేరిట రూ. 4వేల నుంచి 5 వేలకు డీడీఎస్ చెల్లించారని, ఎఫ్డీఆర్, పీడీఎస్ ద్వారా వచ్చిన డబ్బులు సైతం డీడీఎస్ అధీనంలోనే ఉన్నాయన్నారు.
డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా అమ్మిన భూములను తిరిగి ఇవ్వాలని, ఎఫ్డీఆర్, పీడీఎస్, డిపాజిట్ డబ్బులను చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్టీవోలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా డీడీఎస్ సంస్థ ప్రతినిధులు అమ్మిన 74 ఎకరాల భూములు తిరిగి మహిళా సంఘాల ఇవ్వడంతో పాటు ఎఫ్డీఆర్, పీడీఎస్, డిపాజిట్ డబ్బుల కోసం చెల్లించాలన్నారు. లేనిపక్షంలో మహిళా సంఘాల సభ్యులతో కలసి పోరాటం చేస్తామని మాజీ డైరెక్టర్ గోపాల్ హెచ్చరించారు.