సిద్దిపేట అర్బన్, జనవరి 23 : భూసేకరణ వేగవంతం చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గౌరవెళ్లి రిజర్వాయర్‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియపై సిద్దిపేట కలెక్టరేట్లో మంగళవారం నీటిపారుదల, సర్వేల్యాండ్, రెవెన్యూశాఖల అధికారులు, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ మండలాలవారీగా మండల సర్వేయర్, ఆర్ఐ, ఇరిగేషన్ ఒక టీమ్‌గా ఏర్పడి ఆయా గ్రామాల్లో కాల్వల కోసం భూసేకరణ చేయాలన్నారు. కాల్వల వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ భూసేకరణ జరపాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో హుస్నాబాద్ ఆర్డీవో బెన్‌షాలం, సర్వే ల్యాండ్ ఏడీ వినయ్‌కుమార్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.