పటాన్చెరు/పటాన్చెరు రూరల్, జూలై 24: మన ఇంటికి ఈ రోజు కేటీఆర్ సారు వస్తున్నారని తండ్రి దుర్గం శశిధర్‌గౌడ్ తన పిల్లలతో ఉదయం చెబితే వారు నమ్మలేదు. డాడీ ఉత్తినే చెబుతున్నావు. కేటీఆర్ సార్ బర్త్‌డే ఈ రోజు అంటూ పిల్లలు శాన్విక, శర్ణిక గుర్తుచేశారు. తండ్రి తాను నిజంగానే చెబుతున్నానని చూడు ఈ రోజు మన ఇంటికి కేటీఆర్ వస్తారంటూ ఆనందంగా తెలిపాడు. అన్నట్టుగానే గురువారం మధ్యాహ్నం కేటీఆర్ ఇంట్లోకి వస్త్తుంటే ఆ చిన్నారుల్లో ఆశ్చర్యం, ఆనందం.
సంభ్రమాశ్చర్యాలతో తండ్రి శశిధర్గౌడ్తో కలిసి కేటీఆర్‌కు స్వాగతం పలికారు. షేక్ హ్యాండిచ్చి హ్యాపీ బర్త్ డే అంకుల్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్‌గౌడ్ పిల్లలని తెలుసుకున్న కేటీఆర్ వారిని ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు. మీరు వస్తున్నారంటే తన పిల్లలు నమ్మలేదని నవ్వుతూ శశిధర్‌గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో అన్నారు. నేను నిజంగానే వచ్చాను కదా బేటా.. అంటూ కేటీఆర్ నవ్వుతూ చెప్పడంతో ఆ పిల్లల కండ్లల్లో ఆనందం
కనిపించింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ విభాగం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టిన ట్వీట్‌ను లైక్ చేస్తూ దుర్గం శశిధర్‌గౌడ్ మార్చి 15న రీట్వీట్ చేశారు. నల్లబాలుగా సోషల్ మీడియాలో పిలిచే శశిధర్‌గౌడ్ పెట్టిన రీట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల పోలీస్ కేసులు అతనిపై పెట్టించింది. జూన్ 29న రాత్రి నల్లబాలు ఇంటికి వచ్చిన 25మంది పోలీసులు ఇంట్లో అన్నం తింటున్న అతడిని బలవంతంగా కుటుంబ సభ్యుల సమక్షంలో అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ అక్రమ అరెస్టు సందర్భంగా శశిధర్‌గౌడ్ కుటుంబం మొత్తం భయభ్రాంతులకు గురైంది.
చిన్నపిల్లలు తండ్రిని పోలీసులు తీసుకెళ్లారని ఏడుస్తుండి పోయారు. 20 రోజుల తర్వాత జైలు నుంచి శశిధర్‌గౌడ్‌ను వదిలేశారు. బీఆర్ఎస్ పార్టీ అభిమాని, సోషల్ మీడియా వారియర్ నల్లబాలుపై పోలీసులు మూడు అక్రమ కేసులు పెట్టారు. వారు పెట్టిన కేసుల్లో బెయిల్ లభించిన శశిధర్‌గౌడ్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని తన వివాసానికి వచ్చాడు. శశిధర్గౌడ్పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను మొదటి నుంచి ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కలిసేందుకు ఆయన నివాసానికి తరలివచ్చారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డ్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డితో కలిసి వచ్చారు. తన జన్మదిన వేడుకలు సైతం శశిధర్గౌడ్తో కలిసి కేటీఆర్ జరుపుకోవడం ఆ కుటుంబంలో ఆనందం, ధైర్యాన్ని నింపింది.
సంభ్రమాశ్చర్యంతో స్వాగతం పలికిన కుటుంబం…
కేటీఆర్ ఈ రోజు మీ ఇంట్లోనే జన్మదిన వేడుకలు జరుపుకొంటారని బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చిన సమాచారం మేరకు శశిధర్‌గౌడ్ కుటుంబం అమితాశ్చర్యానికి గురైంది. చెప్పినట్టుగానే గురువారం మధ్యాహ్నం కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణుల వాహనాలు ఇంటిముందు ఆగడంతో నల్లబాలు కుటుంబ సభ్యులు ఆనందంతో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. పిల్లలు వేసిన బర్త్ డే గ్రీటింగ్ కార్డులను శశిధర్‌గౌడ్ కేటీఆర్‌కు అందజేశారు. తండ్రిని అరెస్టు చేసినప్పుడు బాధపడ్డ పిల్లలను కేటీఆర్ దగ్గరగా తీసుకుని వారికి బేటా నేను మీకు అండగా ఉంటాను. మీ నాన్నకు ఏమి కాదంటూ పేర్కొన్నారు. పిల్లలు శాన్విక, శర్ణికలను పరిచయం చేసుకున్నారు.
శశిధర్‌గౌడ్ తల్లి విజయలక్ష్మి పక్కన కూర్చుని ఆమె ఆరోగ్యం, ఇతర వివరాలు కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు అక్రమ అరెస్టు జరిగిన తీరును విజయలక్ష్మి కేటీఆర్‌కు వివరించింది. నీవే మాకు ధైర్యం అంటూ కేటీఆర్ చేతులు పట్టుకుంది. స్పందించిన కేటీఆర్ మీకు అండగా మా అధినేత కేసీఆర్ ఉంటారు, నేనుంటాను, పార్టీ ఉంటుంది. మీరు భయపడాల్సిందేమీ లేదు. వచ్చేది మన ప్రభుత్వమే, మీకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీనిచ్చారు. బాధపడకు ఏ సమస్య వచ్చిన నాకు తెలుపండి అంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో విజయలక్ష్మి సంతోషంతో అన్నం తిను బిడ్డా అంటూ భోజనం చేయాలని ఆప్యాయంగా కోరింది.
అంతలో శశిధర్‌గౌడ్, అయన కుటుంబం తెచ్చిన కేక్‌ను కేటీఆర్ ముందు పెట్టారు. కేటీఆర్ శశిధర్‌గౌడ్ ఆయన కుమార్తెలతో కలిసి కేక్ కట్ చేశారు. పిల్లలు కేటీఆర్‌కు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆప్యాయతను చాటారు. స్వయంగా కేటీఆర్ తమ ఇంట్లోకి వచ్చి పుట్టినరోజు వేడుకలు జరపడం వారింట్లో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. తల్లి విజయలక్ష్మి తెప్పించిన అన్నం కేటీఆర్ తినడంతో ఆమె కేటీఆర్‌ను దీవించారు. కేటీఆర్ వారితో సరదాగా గడపడంతో ప్రభుత్వం చేసిన గాయాన్ని ఆ కుటుంబం మరిచిపోయింది. కేటీఆర్ మాకున్నారు, పార్టీ మాకుందనే ధీమా వారిలో కనిపించింది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు కేటీఆర్ వారితో గ్రూప్ ఫొటోలు దిగారు.
శర్ణికకు పుట్టిన రోజు గిఫ్ట్ అందజేసిన కేటీఆర్…
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు ఇంటికి వచ్చిన కేటీఆర్ ఆయన చిన్న కుమార్తె శర్ణికకు పుట్టినరోజు గిఫ్ట్ అందజేశారు. 20రోజులుగా శశిధర్‌గౌడ్ అక్రమ కేసులో జైలులో ఉన్నప్పుడు ఈ నెల 7న ఆయన చిన్నకూతురు శర్ణిక పుట్టిన రోజు వచ్చింది. తండ్రి జైలులో ఉండటంతో ఆమె పుట్టిన రోజును జరుపుకోలేదు. తండ్రి ప్రతి ఏడాది ఇచ్చే గిఫ్ట్ లేకపోవడం ఈ ఏడాది ఆ పాపకు చేదు అనుభవం మిగిల్చింది. అది తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పాపకు, ఆమె అక్క శాన్వికలకు బర్త్ డే గిఫ్ట్‌ను అందజేసి ఆమె మోహంలో ఆనందం నింపారు. కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్ అంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ బహూకరించారు. స్వయంగా కేటీఆర్ గిఫ్ట్ ఇవ్వడం ఆ ఇంట్లో సంతోషాన్ని నింపింది.
బిడ్డా.. మీరు తప్పకుండా సీఎం అవుతారు..
ఇంద్రేశంలోలో నల్లబాలు ఇంటికి కేటీఆర్ చేరుకోగానే అతని తల్లి విజయలక్ష్మి బిడ్డా.. మీరు తప్పుకుండా రాష్ర్టానికి సీఎం అవుతారని కౌగిలించుకొని ఆశీర్వదించారు. సామాన్య కార్యకర్త కుటుంబంలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంతో పాటు భోజనం చేయడంతో వారు ఆనందానికి గురయ్యారు. తమ ఇంటికి కేటీఆర్ రావడం ఎప్పుడూ మరిచిపోలేమని పేర్కొన్నారు.
హనుమాన్ విగ్రహానికి విరాళం
మాధారంలో ఏర్పాటు చేస్తున్న పంచముఖి హనుమాన్ విగ్రహానికి బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కన్వీనర్ ఆదర్శ్‌రెడ్డి గురువారం కేటీఆర్ చేతులు మీదుగా గ్రామ నాయకులు సురేందర్‌కు అందించారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని పంచముఖి హనుమాన్ విగ్రహానికి విరాళం ఇచ్చినట్టు ఆదర్శ్‌రెడ్డి, కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి దంపతులు తెలిపారు. కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శరెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బాల్‌రెడ్డి, ఐలాపూర్ మాణిక్‌యాదవ్, గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, శ్రీధర్‌చారి, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, జగదీశ్ ఉన్నారు.
సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు..
నల్లబాలు ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ రాగానే సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నల్లబాలు ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేశారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు. ఇండ్లపైకి ఎక్కి మహిళలు, యువకులు వీడియోలు తీసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కేటీఆర్ ధైర్యం నింపారు
పటాన్చెరు/ పటాన్చెరు రూరల్, జూలై 24: నేను 2009 నుంచి ఉద్యమకారుడిని. రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్న అక్రమాలను ఎప్పడికప్పుడు ఎండగడుతున్నాను. ఈ ఏడాది మార్చి 15న బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పెట్టిన నో విజన్, నో మిషన్, ఓన్లీ 20 పర్సంట్ కమీషన్ అనే ట్వీట్‌కు మద్దతుగా రీట్వీట్ చేశాను. ఆ తర్వాత మార్చి 16న మూడుచోట్ల నాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కరీంనగర్, గోదావరిఖని, రామగుండంలో పోలీస్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూన్ 29న ఇంద్రేశంలోని నా ఇంట్లోకి రాత్రి 9 గంటల ప్రాంతంలో 25మంది పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి నన్ను నా కుటుంబ సభ్యుల సమక్షంలోనే బలవంతంగా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. నా కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా వారు వినకపోవడం బాధేసింది.
కోర్టు నాకు 20 రోజుల రిమాండ్ విధించింది. కరీంనగర్ జైలులో నన్ను పెట్టారు. ఈనెల 18న నన్ను జైలు నుంచి వదిలేశారు. జైలు జీవితంలో నాకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ధైర్యంతో భయపడకుండా ఉన్నాను. ఇప్పుడు స్వయంగా కేటీఆర్ మా ఇంటికి రావడం సంతోషాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. భావప్రకటన హక్కును ప్రభుత్వం కాలరాస్తే ఊరుకునేది లేదు. తప్పును తప్పుగానే చెబుతాను. కోర్టులో వీరు పెట్టిన కేసుల వివరాలు విని జడ్జి కూడా నవ్వారు. మాలాంటి వారికి కేటీఆర్ అన్ని రకాలుగా అండగా నిలువడం ధైర్యం నింపింది.
– దుర్గం శశిధర్‌గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్
నీవే మా ధైర్యం..
పటాన్చెరు/ పటాన్చెరు రూరల్, జూలై 24: నీవే మా ధైర్యం అని కేటీఆర్‌తో అన్న. నా బిడ్డ శశిధర్‌ను పోలీసులు రాత్రి సమయంలో వచ్చి తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లిండ్రు. మాకు శానా భయం వేసింది. అర్ధరాత్రి తీసుకెళ్లి ఏమన్న చెస్తారని మా భయం. పిల్లలు, భార్య అందరూ భయపడి ఏడుపందుకున్నారు. నాకు ఎక్కడ తోచలేదు. మా వాళ్లు కేటీఆర్‌కు విషయం చెబితే నేనున్నానని ధైర్యం నింపిండు. అప్పటి నుంచి కేటీఆర్ సారు మాతో మాట్లాడుతుండు. నా బిడ్డకు ఏమి కాదని ధైర్యంతో ఉన్నాను. 20రోజులు జైలులో ఉండి నా బిడ్డ బయటకు వచ్చిండు. శానా సంతోషం అనిపించింది.
నా బిడ్డ తప్పు చేసే రకం కాదని తెలుసు. దొంగ కేసుల్లో ఇరికించిండ్రు అని తెలుసు. ఏనాటికైనా న్యాయమే గెలుస్తది. ఈ రోజున కేటీఆర్ మా ఇంటికి వచ్చిండు. ముందుగాల మేము నమ్మలే. కానీ కేటీఆర్ ఇంటికి వస్తేనే మాకు శానా ఆనందం కలిగింది. కేటీఆర్ శానా ధైర్యం తెలిపిండు. మాకు నీవే పెద్దదిక్కు బిడ్డా అంటే చేతులు పట్టుకుని నేనున్నాను మీకంటూ ధైర్యం చెప్పిండు.
-దుర్గం విజయలక్ష్మి, (దుర్గం శశిధర్‌గౌడ్ తల్లి)
రేవంత్ జర భద్రం
పటాన్చెరు/ పటాన్చెరు రూరల్, జూలై 24: ఒక్క నల్లబాలును అక్రమంగా అరెస్టు చేస్తే లక్షలాది సోషల్ మీడియా వారియర్స్ పుట్టుకొస్తారు జాగ్రత్త రేవంత్‌రెడ్డి. అక్రమాలు చేస్తున్న రేవంత్ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. రీట్వీట్ చేసినందుకు అరెస్టు చేసి జైలుకు పంపుతారా.? ఇదేం అన్యాయం. మీ అరాచకాలకు ప్రజలే ముగింపు పలుకుతారు. ఒక్కో వారియర్ ఒక్కో కేసీఆర్ అయ్యి రేవంత్‌పై తిరగబడతారు. రేవంత్ అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రగల్భాలు పలికి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు గుంపుమేస్త్రీగా పాలనను అస్తవ్యస్తం చేశాడు. పోలీసులతో భయపెట్టి పాలన చేయాలంటే ప్రతిఘటనను చూడాల్సి ఉంటుంది.
– పావనిగౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ ఇన్చార్జి