చేర్యాల, ఫిబ్రవరి 16: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 21 రోజుల్లో స్వామి వారి హుండీల ఆదాయం రూ.1,15,59,209 సమకూరింది. ఆలయ హుండీలను మహామండపంలో ఆలయ ఈవో ఎ.బాలజీ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ పర్యవేక్షణలో దేవాదాయశాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో శుక్రవారం లెక్కింపులు జరిగాయి. ఆలయంలోని 23 హుండీలను ఆలయ అర్చకులు, ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బంది, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు 230 మందితో లెక్కించారు.
తాజా లెక్కింపులో రూ.1,15,59,209 నగదుతోపాటు 115 గ్రాములు మిశ్రమ బంగారం, 10 కిలోల 100 గ్రాముల మిశ్రమ వెండి, 20 క్వింటాళ్ల బియ్యం, 15 విదేశీ కరెన్సీ లభించింది. కాగా, జనవరి 25న నిర్వహించిన హుండీల లెక్కింపులో రూ.1,39,77,230 ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా ఆలయంలో ఈవో విలేకరులతో మాట్లాడుతూ 21 రోజుల్లో రూ. 1,15,59,209 వచ్చిందన్నారు. ఆలయంలోని 23 హుండీల ద్వారా లభించిన నగదును స్థ్ధానిక ఏపీజీవీబీలో జమ చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుడి మల్లికార్జున్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.