చేర్యాల, ఫిబ్రవరి 24 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రి రోజున ఆలయం ఎదురుగా తోట బావి ప్రాంతంలో కల్యాణ వేదిక ముందు భాగంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పెద్దపట్నం నిర్వహిస్తారు.
కొమురవెల్లి మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం, పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు ముఖ్యమైనవి. పెద్దపట్నం వీక్షించేందుకు భక్తులు రాత్రే మల్లన్న క్షేత్రానికి చేరుకుంటారు. పట్నం వేసే కార్యక్రమాన్ని కనులారా వీక్షించి వేకువజామున వెళ్లిపోతుంటారు. భక్తుల సౌకర్యార్ధం మల్లన్న కల్యాణ వేదిక వద్ద ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. జనగామ, సిద్దిపేట ఆర్టీసీ డిపోల నుంచి కొమురవెల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
ఒగ్గు పూజారులు పంచరంగులతో తయారు చేసిన పట్నం వద్ద జానపద పాటలు పాడుతూ స్వామి వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించే కార్యక్రమమే పెద్దపట్నం.మహా శివరాత్రి సందర్భంగా లింగోద్భవకాలం రాత్రి 12గంటలకు మల్లికార్జున స్వామికి అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు.ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం,రాతి గీరలు తదితర ప్రాంతా ల్లో ఊరేగించి ఆలయంలోకి తీసుకెళ్తారు.
ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 2గంటల సమయంలో ఒగ్గు పూజారులు పంచ రంగులతో ముగ్గుగా వేసి పట్నంగా తయారు చేస్తారు. అనంతరం మల్లికార్జున స్వామి ఉత్సవ విగ్రహాలను పట్నం వద్దకు ఆలయ అర్చకులు తీసుకువచ్చి పూజలు నిర్వహించి ప్రదక్షణలు చేసి గర్భాలయంలోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత భక్తులు పెద్ద పట్నం దాటి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఆల యం పసుపుమయంగా మారుతుంది.