‘ఉద్యమాల గడ్డ దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ సర్కారే’ అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాకలోని రేకులకుంట మల్లన్నస్వామి ఆలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గత దుబ్బాక ఉప ఎన్నికలో మోసపూరిత హామీలు ఇచ్చి మొండిచేయి చూపిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కు రానున్న ఎన్నికలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు.
దుబ్బాక, అక్టోబర్ 21: “ఉద్యమాల గడ్డ దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కారేనని మెదక్ ఎంపీ ,దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. రేకులకుంట మల్లన్న స్వామి చల్లని దీవెనలు.. దుబ్బాక ప్రజల ఆశీర్వాదమే.. బీఆర్ఎస్కు బలమన్నారు. రేకులకుంట దేవాలయ చైర్మన్ రొట్టే రమేశ్, దుబ్బాక మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ నిమ్మ రజిత ఆధ్వర్యంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందుకు ఆలయం వద్దకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఒకటో వార్డు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి మద్దతు తెలిపారు. జై కేపీఆర్… జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. రేకులకుంట, రాజక్కపేట, ఎల్లాపూర్, చెల్లాపూర్, వడ్డేరకాలనీ, బల్వంతాపూర్, పద్మశాలిగడ్డ, హసన్‌మీరాపూర్, అప్పనపల్లి, దుంపలపల్లి గ్రామాల్లో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు మంగళహారతులు, బోనాలు, బతుకమ్మలతో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ముదిరాజ్‌లు, గంగపుత్రలు జలపందిరులు, యాదవులు, ఒగ్గు కళాకారులు డప్పు వాయిద్యాలతో ప్రభాకర్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. గ్రామాలు గులాబీమయంగా మారాయి.
ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మట్లాడుతూ…ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తిగా పేదల సంక్షేమం కోసమే ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చి దుబ్బాక ప్రజలు భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తారనే ధీమా ఇస్తూ.. తనను దుబ్బాకకు పంపించారని గుర్తు చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే…దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రెండుసార్లు మీ ఆశీర్వాదంతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి, సేవ చేసే అవకాశం కల్పించారని, ఇప్పుడు అదే అభిమానంతో అసెంబ్లీకి పంపిస్తే.. మీ బిడ్డగా మీకు సేవ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తనకు మోసపూరిత హామీలు, వాగ్దానాలు తేలియవని, నిస్వార్థంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే స్వభావమన్నారు. దుబ్బాకలో గత ఉప ఎన్నికలలో మాయమాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి మోసగించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కు ఈ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గత ఉన ఎన్నికలలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన రఘునందన్ గత మూడేండ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చాడా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకపోవడంతోనే ఏంచేయలేక పోయానని రఘునందన్ మొసలి కన్నీరు కార్చుతున విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎమ్మెల్యేగా గెలువక ముందు ఒకరకంగా…
గెలిచిన తర్వాత మరోరకంగా రఘునందన్ తీరు ఉన్నదని విమర్శించారు. అలాంటి మోసగాళ్లను మళ్లీ నమ్మి ప్రజలు ఆగం కావద్దని సూచించారు. దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్‌లకు చరమగీతం పాడాలని కోరారు. దుబ్బాక రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు పూర్తి వసతులు కల్పిస్తామన్నారు. రాజక్కపేట-ఎల్లాపూర్ మధ్యన వంతేన (బ్రిడ్జి) నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు నిర్మించి అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతామన్నారు. రాజక్కపేటలో ఆత్మకమిటీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి సంజీవ్‌రెడ్డి మనువరాలు విధితిరెడ్డి దాచుకున్న రూ.10వేలు ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి నామినేషన్ ఖర్చులకు అందజేశారు. కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే నవితాభూంరెడ్డి, ఎంపీపీ పుష్పలతాకిషనన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్‌రావు, కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, రొట్టే రాజామౌళి, రజనీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కొంగరి రాజయ్య, తీపిరెడ్డి మహేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతికృష్ణ, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.