గజ్వేల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర సాధనకే ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, కేసీఆర్ పట్టుదలతో 14ఏండ్ల నిరంతర పోరాటంతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయజెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 నుంచి అనేక మంది అమరులయ్యారని, అప్పటి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు చీమకుట్టినట్లయినా అనిపించలేదన్నారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమ ఫలితంగానే రాష్ర్టాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. మలిదశ ఉద్యమంలో అనేక పోరాటాలు చేయడంతోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు ముందుకొచ్చి ప్రకటన చేసిందన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి ప్రతి కుటుంబానికి న్యాయం చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో వ్యతిరేకత మొదలైందని, ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఊసేత్తడం లేదన్నారు. రైతులు విత్తనాల కోసం రోడ్లమీదికి వస్తున్నారని, ప్రభుత్వం రైతులు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తెవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ జకీయొద్ద్దీన్, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.