ప్రజల దశాబ్దాల కలైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కేసీఆర్ కృషితో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రైల్వేలైన్ పనులు సిద్దిపేట వరకు పూర్తికావడంతో గజ్వేల్, సిద్దిపేట వరకు రైలు పరుగులు తీస్తున్నది. కొమురవెల్లి వరకు పనులు పూర్తయి కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ సిద్ధమైంది. కొమురవెల్లి రైల్వే సేష్టన్ను 26న ప్రారంభించనుండడంతో ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి రైళ్లు పరుగులు తీయనున్నాయి. సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ మీదుగా సిద్దిపేట వరకు 2023 అక్టోబర్ నుంచి రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 26న సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. రైలు సౌకర్యం కల్పించినందుకు కేసీఆర్‌కు, హరీశ్‌రావుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సిద్దిపేట,జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేశారు. కేంద్రం,రాష్ట్రం చెరోసగం నిధులు భరించి ఈ రైల్వే లైన్ పనులు చేపడుతున్నాయి. ఈ రైల్మార్గంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులకు రైల్వేసేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. ఈ ప్రాజెక్టు అమలుకు పునాది వేసి, భూసేకరణ, రాష్ట్ర వాటా నిధుల విడుదల వంటి కీలక ప్రక్రియలు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా చరిత్రలో కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం మరో మైలురాయిగా నిలువనున్నది.మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ఆర్థిక వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం-రా ష్ట్రం సమన్వయంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగేలా కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం కృషిచేసింది.ఈ రైల్వే మార్గం ద్వారా సిద్దిపేట, కొమురవెల్లి, సిరిసిల్ల ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రయా ణ సౌలభ్యంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి హరీశ్‌రావు వెంటపడి పనులు చేయించారు.
రైల్వే లైన్ అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సౌకర్యం మాత్ర మే కాదు. అది ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థను మార్చేశక్తి. దేశంలో అనేక నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, వ్యవసాయ మారెట్లు రైల్వే అనుసంధానం తర్వాతే వేగంగా అభివృద్ధి చెందాయి. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త దారులు తెరవనున్నది. సిద్దిపేట, గజ్వేల్, కొమురవెల్లి ప్రాంతాల ప్రజలు ప్రధానంగా రోడ్డు మార్గంపైనే ఆధారపడేవారు.
ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు హైదరాబాద్‌కు వెళ్లాలంటే బస్సులు, ప్రైవేట్ వాహనాలల్లో అధిక సమయంతో పాటు ప్రయాణ వ్యయం ఎకువయ్యేది. రైల్వే అందుబాటులోకి రావడంతో ఆ వెతలు తీరే అవకాశం ఉంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, కొమురవెల్లి, చేర్యాల వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. వరి, మొకజొన్న, పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తు లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. వ్యవసాయ ఉత్పత్తులను దూర ప్రాంత మారెట్లకు తకువ ఖర్చుతో తరలించవచ్చు.రైల్ సేవలతో రవాణా ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. సరుకు వేగంగా మారెట్ కు చేరుతుంది.రైతులకు మెరుగైన మా రెట్ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాల్లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ఒకటి. కొమురవెల్లి మల్లన్న జాతరను తెలంగాణలో అతిపెద్ద జాతరల్లో ఒకటిగా భావిస్తారు. సిద్దిపేట జిల్లాలోని ఈ ఆలయానికి ప్రతి ఏడాది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఏటా లక్షలాది మంది భక్తులు స్వామివారికి బోనాలు, ఒగ్గు కథలు, మొకులు సమర్పిస్తారు. గ్రామీణ సంస్కృతి, జానపద సంప్రదాయాలు, భక్తి విశ్వాసాలకు ఈ జాతర ప్రతిబింబంగా నిలుస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ యాత్ర ప్రధానంగా రోడ్డు మార్గానికే పరిమితమైంది. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కానుండడంతో భక్తుల చిరకాల ఆకాంక్ష నెరవేరనున్నది. ఇది కేవలం ఒక స్టేషన్ ప్రారంభం కాదు.. తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటక చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది.