నారాయణఖేడ్, మే, 10 : ఇటువైపు విశాలమైన రహదారులు, పుష్కలంగా సాగు, తాగునీరు.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, కొనుగోలు కేంద్రాలు, పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలతో పల్లెలు ఆదర్శంగా నిలుస్తుండగా, సరిహద్దు అవతల కర్ణాటకలోని గ్రామాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గుంతలమయమైన రోడ్లు, తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్త కరెంట్ సరఫరా, అరకొర పింఛన్లతో కన్నడిగులు బీజేపీ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ సరిహద్దులో రెండు రాష్ర్టాల గ్రామాల్లో పరిస్థితులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
‘ఇల్లాలి తీరు వాకిలి చెబుతుంది’ అనే సామెత తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల వద్ద రోడ్ల పరిస్థితి చూస్తే తెలిసిపోతుంది. రెండు రాష్ర్టాల్లోని ప్రభుత్వాల పనితీరుకు అచ్చుగుద్దినట్టు ఈ సామెత సరిపోతుంది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క రోడ్ల విషయంలో మాత్రమే కాదు ఏ అంశంలోనైనా తెలంగాణలోని సరిహద్దు గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని పల్లెలు సమస్యలతో సతమవుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతుంటే, అక్కడి జనం కూడా ఇటువంటి పథకాలు తమకెప్పుడు అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

కర్ణాటకలోని గామతండాలో నీటితొట్టి వద్ద బట్టలు ఉతుకుతున్న మహిళలతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు(ఫైల్)
సరిహద్దు దాటితే కర్ణాటకలో సమస్యల స్వాగతం..
తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలను పరిశీలిస్తే.. సుఖదుఃఖాల మధ్య గిరి గీసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ సరిహద్దు గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే, కర్ణాటకలోని గ్రామాలు సమస్యలకు నిలయంగా మారాయి. తెలంగాణ సరిహద్దు వరకు రెండు లేన్ల రహదారి, కర్ణాటకలో రోడ్లు గుంతలమయంగా మారి, ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు వరకు హుషారుగా దూసుకెళ్లే వాహనదారులు కర్ణాటకలోకి ప్రవేశించగానే నీరసించి అసహనానికి గురవుతున్నారు.
నారాయణఖేడ్ నుంచి కంగ్టి, దెగుల్‌వాడి మీదుగా బార్డర్ వరకు రూ.57 కోట్ల నిధులతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డు ఉండగా, అవతల కర్ణాటక సరిహద్దు నుంచి చింతాకి మీదుగా నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఔరాద్ వరకు సింగిల్ లేన్ రోడ్డు, అది కూడా గుంతలమయమై వాహనాలు నడపలేని దుస్థితిలో ఉంది. తెలంగాణలో మిషన్ భగీరథ పథకంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేశారు. కర్ణాటక గ్రామాల్లో ఇప్పటికీ ఇక్కట్లు తప్పడంలేదు. బోరుమోటార్లు, మినీ ట్యాంకుల వద్ద మహిళలు గుమిగూడి వంతుల వారీగా నీళ్లు తీసుకుపోయే దృశ్యాలు సర్వసాధారణం. తెలంగాణలో విద్యుత్ సమస్యను అధిగమించి, వ్యవసాయానికీ 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేస్తుండగా, కర్ణాటకలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు. డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించడంతో పాటు ట్రాక్టర్‌తో రోజూ చెత్తను తరలింస్తుండడంతో తెలంగాణ పల్లెలన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సరిహద్దు అవతలవైపు కర్ణాటక గ్రామాల్లో పారిశుధ్య సమస్యతో సతమతమవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ సంక్షేమం.. అక్కడ సం‘క్షామం’
తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్, కొనుగోలు కేంద్రాలు లాంటి పథకాలు రైతుల తలరాతను మారుస్తున్నాయి. బీజేపీ పాలిత కర్ణాటకలో వృద్ధాప్య పింఛన్‌ను రెండు కేటగిరీలుగా అంటే 60 ఏండ్ల వయసు పైబడిన వారికి రూ.800లు, 65 ఏండ్ల పైబడిన వారి రూ.1200లు, వితంతువులకు రూ.800లు, దివ్యాంగ పింఛన్ రూ.1500లు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న రైతుబీమా కర్ణాటకలోనూ అమలు చేస్తున్నప్పటికీ రైతు ఆత్మహత్య చేసుకుంటేనే రూ.5 లక్షల బీమా ఆ కుటుంబానికి వర్తిస్తున్నది. తెలంగాణలో సహజ మరణానికీ రూ.5లక్షల బీమా వర్తిస్తున్నది. అది కూడా 10 రోజుల్లో ఆ కుటుంబానికి అందేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కర్ణాటక సరిహద్దు గ్రామాలైన చింతాకి, నాగన్‌పల్లి సహా పలు గ్రామాల్లో ప్రతి ఎండాకాలంలో నీటి కష్టాలు వర్ణణాతీతం. దశాబ్దాల క్రితం నాటి నులక మంచం ఘటనలను గుర్తుకు తెస్తాయంటే అతిశయోక్తి కాదు.
గ్రామాల్లోని రెండు, మూడు బోరుమోటార్ల సాయంతో మినీ ట్యాంకులతో నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఎండాకాలంలో బోర్లు కుంటుపడినా, నీరు అడుగంటినా ఇక ప్రజలు నీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. నీటి కష్టాలు తీర్చాలని ఇక్కడి ప్రజలు పలుమార్లు బీదర్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. తెలంగాణలో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేయడంతో నీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనతో ఏమాత్రం పోల్చుకోలేని స్థితిలో ఉంది కర్ణాటక ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వ పని తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నారాయణఖేడ్ నియోజకవర్గ పర్యటన నిమిత్తం మంత్రి హరీశ్‌రావు నాగల్గిద్ద మండలానికి వెళ్తూ కర్ణాటకలోని గామతండా వ్యవసాయ బావి వద్ద బట్టలు ఉతుకుతున్న మహిళలతో ముచ్చటించారు. వారి మనోగతాన్ని తెలుసుకోగా, అక్కడి మహిళలు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రశంసించడం గమనార్హం.
మా పల్లెలు అభివృద్ధి చెందాయి
మా ఊరు నుంచి కర్ణాటక సరిహద్దు కిలోమీటర్ దూరంలో ఉంది. తెలంగాణ రాకముందు మా ఊర్లన్నీ దాదాపు కర్ణాటకలోని గ్రామాల్లో ఉన్నట్టే అనేక సమస్యలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక ఇక్కడి ఊర్లన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఊరిలో చాలా వరకు సమస్యలు తీరినయ్. ఎండాకాలంలో ఎడ్లబండి మీద వేరే ఊళ్లకు వెళ్లి నీటిని తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు ఆ ఇబ్బందుల్లేవు. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నారు. మా ఊరికి రెండు వరుసల రోడ్డు, అన్ని వసతులు కల్పించారు.
– గొల్ల శ్రీనివాస్, దెగుల్‌వాడి, తెలంగాణ
సమస్యలతో సహవాసం చేస్తున్నాం
మా గ్రామం తెలంగాణ సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఆ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు చూసి వారు అదృష్టవంతులని అనుకుంటాం. మా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఎండాకాలంలో నీటి కోసం చాలా కష్టాలు పడుతున్నాం. నీటి సమస్యపై అనేక సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో బీదర్‌లోని జిల్లా కార్యాలయం ఎదుట నిరసన కూడా చేశాం. తెలంగాణలో ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నారు. తెలంగాణలో అందుతున్న సదుపాయాలు చూసి మేమూ తెలంగాణలో ఉంటే బాగుండు అని అనిపిస్తున్నది.
– వరుణ్, నాగన్‌పల్లి, కర్ణాటక