సంగారెడ్డి/మెదక్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో కంటి వెలుగుకు అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,76, 936 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 84, 285 మంది కాగా, 92,651 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 19,853 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. మరో 18,603 మం దికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. 30వ రోజు జిల్లా వ్యాప్తం గా 39 బృందాలు పాల్గొని 6545 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 3062 కాగా, మహిళలు 3483 మంది ఉన్నారు. అయితే 552 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, 539 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో చందునాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 రోజుల్లో 1,76,936 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, ఇందు లో 19,853 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామన్నారు. కంటి వెలుగు శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం రెండో విడత ప్రారంభించిన కంటివెలుగు శిబిరాలకు భారీగా ప్రజలు తరలివస్తూ కండ్లను పరీక్షించుకుంటున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో 17350 మందిని పరీక్షించేందుకు లక్ష్యం పెట్టుకోగా 16764 మందికి కంటి పరీక్షలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 66 కంటివెలుగు శిబిరాలలో ప్రజలు కండ్ల పరీక్షలకు బారులు తీరారు. వైద్యాధికారులు అన్ని రకాలుగా పరీక్షించి తప్పనిసరిగా అవసరమున్న 1410 మందికి ప్రత్యేక ఆపరేషన్లకు ఇతర దవాఖానలు ప్రతి పాదించారు. అక్కడికక్కడే సాధారణ అద్దాలు అవసరమున్న 1029 మందికి అధికారులు పంపిణీచేశారు.
చదువుకునేందుకు వీలుగా అద్దాల కోసం 918 మందిని గుర్తించిన కంటివైద్య నిపుణులు అద్దాలు అందజేశారు. కండ్ల సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలలో మెరుగైన చికిత్సలు అందిస్తున్నారని ప్రజలు నేత్రానందంతో సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.