ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. కంటివెలుగు, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, 58, 59, 76 జీఓల కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన భూముల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. వేసవి కాలం సమీపిస్తున్నందున కంటివెలుగు శిబిరాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ మినహా పట్టణాల్లో పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పది రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.
– మెదక్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్
మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 24: ప్రభుత్వ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, జీవో 58, 59ల ప్రకారం క్రమబద్ధీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పట్టాల్లేకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, అబాది గ్రామ కంఠం, శిఖం, వక్ఫ్, దేవాదాయ భూముల క్రమబద్ధీకరణ చేసేందుకు గల అవకాశం, ప్రాతిపదికన అనుసరించాల్సిన విధానంపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటివరకు 25 పని దినాల్లో 51.86 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. జీహెచ్ఎంసీలో మినహాయించి పట్టణాల్లో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ మినహాయించి పట్టణాలలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మరో 21 వేల 787 లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని వారం, పది రోజుల్లో లబ్ధిదారులను వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం అర్హత సాధించిన దరఖాస్తుల పట్టా సర్టిఫికెట్లను సిద్ధం చేశామన్నారు. జీవో 59 ప్రకారం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జీవో 59 కింద అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి క్రమబద్దీకరణ రుసుం విడతల వారీగా వసూలు చేయాలన్నారు. మొదటి విడత సేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. మార్చి చివరి నాటికి మొత్తం రుసుం చెల్లించిన వారికి పట్టాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పోడు భూముల పంపిణీకి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఆమోదించిన పోడు పట్టా వివరాలను డౌన్లోడ్ చేసి ఒకసారి సరి చూసుకుని పట్టా పాస్ పుస్తకాలు ముద్రణ చేయాలని సీఎస్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో సంగారెడ్డి కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నర్సరీల్లో మొక్కలపై శ్రద్ధ వహించాలి: మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ప్రతి శుక్రవారం అధికారులతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. నేడు అటవీ శాఖ, డీఆర్డీవో, మున్సిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశామన్నారు. 9వ విడత హరితహారంలో 30 లక్షల మొకల లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో సిద్ధం చేశామన్నారు. కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఎంహెచ్వో చందు నాయ క్, ఆర్డీవో సాయిరామ్, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, బీసీ అధికారి కేశూరం, జిల్లా వ్యవసాయాధికారి ఆశా కుమారి, ఉద్యాన శాఖా అధికారి నర్సయ్య పాల్గొన్నారు.