కోహీర్, జూలై 16: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి హైదరాబాద్‌లోని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాణిక్‌రావు మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలో 900మందికిపైగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరయ్యాయన్నారు. వారికి ఏడు నెలలుగా అందజేయకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీ విషయంలో కలెక్టర్, ఆర్డీవోకు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేదన్నారు. వారు అనేక కారణాలు చెబుతూ పంపిణీని వాయి దా వేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే చెక్కులు పంపిణీ చేసేలా చూడాలని, ప్రొటోకాల్ పాటించాలని స్పీకర్‌ను కోరారు.