చేర్యాల, డిసెంబర్ 28 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని అధికార పక్షాన్ని నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రశ్నించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. విదేశీ పర్యటన ముగించుకుని జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన్ను ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు (బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన) మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ప్రజా ప్రతినిధులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తూనే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతపరంగా పరిష్కరించాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన ప్రజాప్రతినిధులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీ మెజార్టీతో గెలిచారని, కొన్ని గ్రామాల్లో ఓటమి చెందారని, అయినా అభ్యర్థులు నిరాశకు లోనుకావద్దని, ప్రజల వెంటే ఉంటూ వారి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.గ్రామాల అభివృద్ధికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, మీ స్థ్ధాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కనపెట్టి రేవంత్ సర్కారు అందాల పోటీలు, ఆటల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నదని మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే సర్కారు అందాల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ సర్కారు చేపడుతున్న ఇలాంటి పోటీల గురించి ప్రజలకు వివరించి రానున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారు.