కొండకోనలు, గుట్టల మధ్య నుంచి గలగల పారుతూ పరవళ్లు తొక్కుతూ జాడిమల్కాపూర్ జలపాతం జలాలు కర్ణాటకకు బిరబిరా తరలిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు గుండా ప్రవహించే పెద్దవాగు నుంచి జలమంతా కండ్ల ముందే తరలిపోతున్నా ఏం చేయలేని దుస్థితి ఈ ప్రాంత రైతులది. ఈ జలపాతం గుండా కర్ణాటకకు తరలుతున్న నీటిని మొగుడంపల్లి మండలంలోని పలు గ్రామాలకు సాగుకు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా, ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవడం లేదు. పెద్దవాగుపై ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే మొగుడంపల్లి మండలంంలో వందలాది ఎకరాలకు పైగా సాగునీరు అందించవచ్చు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ దిశగా ఎలాంటి కృషిచేయడం లేదు. పెద్దవాగు గుండా ప్రవహిస్తున్న జలమంతా కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని చించోళి తాలూకా పరిధిలోని చండ్రంపల్లి ప్రాజెక్టుకు ప్రధాన జల వనరుగా మారింది. వేసవిలోనూ పెద్దవాగులో వరద కొనసాగుతూ చండ్రంపల్లి ప్రాజెక్టుకు జీవనాడిగా మారింది.
జహీరాబాద్, ఆగస్టు 23: పెద్దవాగుపై ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి కర్ణాటకకు వృథాగా తరలిపోతున్న జాడీమల్కాపూర్ జలపాతం జలాలను ఒడిసిపట్టి తమకు సాగునీరు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల రైతులు కోరుతున్నారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలంలో జాడిమల్కాపూర్ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారాంతపు సెలవు దొరికితే తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామ శివారులో పెద్దవాగు ప్రాజెక్టు వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకే నిండిపోతుంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్న వరదంతా జహీరాబాద్, మొగుడంపల్లి మండలంలోని మల్చె ల్మ్లా, జాడీమల్కాపూర్, సజ్జారావుపేట తదితర గ్రామాల మీదుగా కర్ణాటకకు వెళ్తుంది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోళి తాలూకా పరిధిలోని బీమా నది తీరంలో 1973లో చండ్రంపల్లి ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు పెద్దవాగు నీళ్లే ఆధారం. ఈ ప్రాజెక్టు ద్వారా కర్ణాటకలో సాగు, తాగునీరు అందుతున్నది. పెద్దవాగుపై ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా, పాలకులు శ్రద్ధ చూపడం లేదు. పెద్దవాగు ఇరువైపులా కొండలు ఉండడంతో ప్రాజెక్టు నిర్మించి, ఎత్తిపోతల పథకం ద్వారా పొలాలకు నీటిని అందించవచ్చని స్థానిక రైతులు చెబుతున్నారు.
ఎత్తిపోతల పథకం ద్వారా మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్, సజ్జారావుపేట తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. దశాబ్దాల క్రితమే పెద్దవాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తే సరిహద్దు సమస్య తలెత్తుతుందని భావించి ఆధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. అటవీ ప్రాంతంలో కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి జలజలా రావాలు చేస్తూ కనిపించే జలపాత సోయగాలు పర్యాటకులకు ఎంతో అహ్లాదాన్ని పంచుతాయి. కానీ, ఇక్కడ కనీస సౌకర్యాలు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగునీరు దొరకని పరిస్థితి ఉంది. రోడ్డు సరిగ్గా లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోటళ్లు, వసతి గృహాలు, రోడ్డు సౌకర్యం కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.