Kerala : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఒక కారు ఢీకొనడంతో కారులోని ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కేరళలోలని త్రిశూర్ జిల్లాలో, శుక్రవారం రాత్రి 11.40 గంటలకు జరిగింది. మృతులంతా తమిళనాడుకు చెందినవారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి.
తమిళనాడు, దిండిగల్‌లోని పీఎస్ఎన్ఏ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు కేరళలోని గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వెళ్తున్నారు. ఇదే సమయంలో 66వ జాతీయ రహదారిపై పనంబిక్కున్ను వద్ద ఒక లారీ శుక్రవారం రాత్రి రోడ్డుపై ఆగిపోయింది. విద్యార్థులు వెళ్తున్న కారు వెనుక నుంచి వచ్చి, ఆగి ఉన్న లారీని ఢీకొంది. కారు అతి వేగంగా ఉండటం వల్ల లారీని ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఘటనలో కారులోని 8 మంది విద్యార్థులు మరణించారు. కారు నుజ్జునుజ్జయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
గాయపడిన విద్యార్థుల్ని బయటకు తీశారు. కారు, లారీని గుద్ది ఇరుక్కుపోవడంతో, కారులో చిక్కుకున్న క్షతగాత్రుల్ని బయటకు తీసేందుకు కార్‌ను కట్ చేయాల్సి వచ్చింది. అనంతరం విద్యార్థుల్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ విద్యార్థులు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం త్రిశూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.