Director Chandra Siddhartha | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మరో వినూత్న ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఆటగదరా శివా’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, తాజాగా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’(Ee Pata Korinavaru Nemalipalem Nundi Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi Modalaguvaru) అనే హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’ అనేది దీనికి ఉప శీర్షిక. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్ర సిద్ధార్థ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న తొలి చిత్రమని యూనిట్ చెబుతోంది. ప్రముఖ దివంగత దర్శక-రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. మదన్ తన చివరి రోజుల్లో ప్లాన్ చేసిన ఈ కథాంశంపై చంద్ర సిద్ధార్థ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకప్పుడు మదన్ అందించిన కథతోనే ‘ఆ నలుగురు’ వంటి క్లాసిక్ చిత్రాన్ని తీసిన చంద్ర సిద్ధార్థ్, ఇప్పుడు మరోసారి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు.
ఈ చిత్ర కథాంశం అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతిరోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఒక నిర్దిష్ట రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ ఉంటుంది. ఆ పాటను నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు కోరుతుంటారు. ఈ విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారంగానే సినిమా టైటిల్‌ను పెట్టడం విశేషం. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఇది తెలుగు తెరపై వస్తున్న మొట్టమొదటి మిస్టరీ మ్యూజికల్ చిత్రం కావడం మరో ప్రత్యేకత. సౌండ్ థెరపీ, న్యూరోసైన్స్, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, మానవ మెదడుకు, ధ్వనికి మధ్య ఉన్న సంబంధం, అపరాధ భావన వంటి సరికొత్త అంశాలను మేళవించి దర్శకుడు ఈ మిస్టరీ కథనాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంతో హర్ష హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఆయన సరసన అమైరా గోస్వామి కథానాయికగా నటిస్తుండగా, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రంలో సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఉండటంతో జే రెక్స్ అందించిన బాణీలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాకు కథ: మదన్, సంగీతం: జే రెక్స్, పాటలు: చంద్ర సిద్ధార్థ్, మాటలు: పులగం చిన్నారాయణ, ఆర్ట్: అంజి కొయ్యల, సినిమాటోగ్రఫీ: సామ్ సుప్రీత్, ఎడిటింగ్: బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్, సహ నిర్మాతలు: అగస్త్య మంజు, సాగర్, మహి, సమర్పణ: వై.వి.సత్యనారాయణ రాజు అందించగా, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలను చంద్ర సిద్ధార్థ్ స్వయంగా నిర్వర్తించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ వినూత్న ప్రయత్నం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.