రామాయంపేట, జూన్ 25 : రామాయంపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో పది కిలోమీటర్ల దూరంలో లక్ష్మా పూర్ క్రాస్ రోడ్డు వద్ద రాత్రయితే ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు నుంచి మరో పది కిలోమీటర్ల దూరంలో దాదాపు 5 గ్రామాలు, 10 గిరిజన తండాలు ఉన్నాయి. చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఉంది. లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు నుంచి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. క్రాస్ రోడ్డు నుంచి కామారెడ్డి వెళ్లే దారిలో ప్రయాణికులు వాహనాలపై వెళ్తుంటారు.మెదక్ నుంచి కామారెడ్డికి బస్సులు,ఆటోలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ, ఇక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి బస్టాండ్ లేదు. రాత్రయితే చిమ్మ చీకటి కమ్ముకుంటున్నది. ఎక్కడి నుంచి అడవి జంతువులు వస్తాయో తెలియదు.పొద్దంతా ఎండకు, రాత్రి చీకటితో అక్కడ నిలువడానికి ఆయా గ్రామాల ప్రయాణికులు, ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
కూతవేటు దూరంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఉన్నా, లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కనీసం ఓ లైట్ వెలిగిద్దామనే ఆలోచన అధికారులకు లేకపోవడం విడ్డూరంగా ఉంది.గతంలో అక్కడ బస్టాండ్ ఉండేది. మెదక్- ఎల్కతుర్తి రోడ్డు విస్తరణలో బస్టాండు తొలిగించారు. గతంలో అక్కడ విద్యుత్ స్తంభాలు ఉండేవి.ప్రతిరోజు లైట్లు వెలుగుతుండేవి.ఇప్పుడు లక్ష్మాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి వివిధ గ్రామాలకు వెళ్లాలంటే రాత్రి ప్రజలు భయపడుతున్నారు.
ఒక పక్క చిరుతలు, నక్కల అరుపులు, మరోపక్క దొంగల సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. రాత్రయితే లక్ష్మాపూర్ క్రాస్‌రోడ్ వద్ద అంధకారం అలుముకుంటున్నది. లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు నుంచి కాట్రియాల, దంతెపల్లి, పర్వతాపూర్, కిషన్ తండాతో పాటు మరో పది వరకు గిరిజన తండాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు వారి గమ్యస్థానానికి వెళ్లాలంటే, లక్ష్మాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద బస్సు దిగి వెళ్లాల్సిందే.ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బస్టాండ్ నిర్మాణంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు. రాత్రిపూట పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చినా లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు నుంచే గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. రాత్రయితే మా గ్రామానికి వెళ్తామనే గ్యారంటీ లేదు. రాత్రిపూట లక్ష్మాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద నిలబడాలంటేనే భయం భయంగా ఉంటున్నది. రాత్రి 9గంటలు దాటితే చిరుతలు, అడవి పందుల సం చరిస్తున్నాయి. దొంగల భయం ఉంది. కనీసం ఇక్కడ ఓ లైటు కూడాలేదు. కూర్చుందామంటే బస్టాండు లేదు. వర్షం వస్తే వానలో నాని పోవాల్సిందే.అధికారులు, నాయకులు క్రాస్ రోడ్డు వద్ద కనీసం విద్యుత్ దీపాలైనా పెడితే మాకు భయం ఉండది.
-లంబాడీ జాదవ్ సాయినాథ్, కిషన్ తండా, రామాయంపేట
లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద మంచిగ బస్టాండు ఉండే. రోడ్డు రిపేర్ పేరిట ఉన్న బస్టాండును తీసేశారు.ఇప్పుడు అక్కడ వర్షం వచ్చినా, పొద్దంతా ఎండవేడిమి అక్కడ మేము బస్సులు, ఆటోల కోసం నిలబడాల్సిందే.రాత్రిపూట మా ఊరికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం.ఈ విషయం స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. క్రాస్ రోడ్డు నుంచి 15 గ్రామాలు, తండాలకు ప్రజలు వెళ్తారు. రాత్రపూట బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే.
-వినోద్ నాయక్, కాట్రియాల, రామాయంపేట
ఈ ప్రాంతంలో చిరుతలు తిరుగుతున్నాయి.మేము రాత్రయితే బయటకు వెళ్లాలంటేనే భయవేస్తున్నది. ఎక్కడైనా ఊరికి పోయి రావాలంటే లక్ష్మాపూర్ స్టేజీ వద్ద ఆగాల్సిందే.అక్కడ ఆగితే మాకు ఎలాంటి భద్రత లేదు.ఎక్కడ నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు. రెండు రోజుల క్రితం నుంచి పులి సంచరిస్తుందని అంటున్నారు. స్టేజీ వద్ద కనీసం నిలబడాలంటే బస్టాండు లేదు. మనిషి మనిషికి కనిపించకుండా లైట్లు కూడా లేవు.మా ఇబ్బందులను ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.
-ధన్‌రాజ్ నాయక్, దంతెపల్లి, రామాయంపేట