హుస్నాబాద్, ఆగస్టు 14: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యపై విద్యార్థులు ఆసక్తిపెంచుకోవాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
హుస్నాబాద్ ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని, అందుకే శాతవాహన యూనివర్సిటీ ద్వారా ఇక్కడ ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళాశాలలో సకల సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృ షి చేస్తానని, నాణ్యమైన విద్య అందించేందుకు అధ్యాపకుల నియామకం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. కళాశాల సొంత భవనానికి స్థల సేకరణ జరిగిందన్నారు. క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులు, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆమె సూచించారు.
నాణ్యమైన విద్య అందించేందుకు కృషి
హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తామని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ అన్నారు. క్లాస్‌రూమ్‌లు, లాబ్స్, ప్రాక్టికల్స్ గదులు ఏర్పాటు చేశామని, టాప్‌మోస్ట్ సిబ్బంది నియామకం చేశామన్నారు. మొదటి సంవత్సరం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు. నెగెటివ్ థింకింగ్ కాకుండా పాజిటివ్ ధోరణిలో ఉంటే అన్ని సాధ్యమవుతాయన్నారు.
కళాశాల పక్కా భవన నిర్మాణానికి ప్రణాళికలు
శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసే అవకాశం తనకు రావడం ఆనందంగా ఉన్నదని, త్వరలోనే కళాశాలకు పక్కా భవనం నిర్మాణం చేసి విద్యార్థులకు సకల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గురువారం కళాశాలలో జరిగిన తరగతుల ప్రారంభోత్సవానికి కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో ఆయన ఫోన్లో మాట్లాడగా నిర్వాహకులు మైక్ ద్వారా వినిపించారు.
హుస్నాబాద్ పట్టణ శివారులో 35ఎకరాల్లో కళాశాల భవనానికి సీఎంతో శంకుస్థాపన చేయిస్తానని చెప్పారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు కాబట్టి క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించినట్లయితే భవిష్యత్‌లో కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఎక్కువ మొగ్గు చూపుతారన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఏసీపీ సదానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.