స్వరాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గ రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ప్రగతి కనిపిస్తున్నది. మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ఒకనాడు దుర్భిక్ష ప్రాంతంగా.. వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. గోదావరి జలాలు వచ్చాయి. బంగారు పంటలు పండుతున్నాయి. కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రజలకు పాలన చేరువైంది.
దుబ్బాక,సెప్టెంబర్ 14 : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయాల భవనం (ఐవోసీ) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.17 కోట్లతో సకల హంగులతో.. సర్వాంగ సుందరంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. తహసీల్ కార్యాలయంతో పాటు మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొనసాగేలా సమీకృత భవనం నిర్మిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారం, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాకలో అభివృద్ధి జోరందుకున్నది. దుబ్బాక అభివృద్ధి సిగలో ఐవోసీ భవనం చేరనుండడంతో అధికార యం త్రాంగంతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అద్దె గదుల్లో, అసౌకర్యాలతో కార్యాలయాలు కొనసాగడంతో అధికారులకు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. వాన కురిస్తే భవనాలు ఊరువడంతో తిప్పలు పడ్డారు. ఐవోసీ భవన నిర్మాణంతో ఆ వెతలన్నీ తీరనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోటకు రావడంతో అధికారులతో పాటు ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయి. పాలన చేరువ కానున్నది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వేగంగా అమలు కానున్నాయి.
4 ఎకరాల్లో రూ.17 కోట్లతో ఐవోసీ భవనం..
దుబ్బాకలో ఐవోసీ భవనానికి నిర్మాణానికి ఐదేండ్ల కిందట నిధులు మంజూరయ్యాయి. స్థల సేకరణ తదితర కారణాలతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సహకారంతో అడ్డంకులు తొలిగించి ఐవోసీ భవన నిర్మాణ పనులు వేగంగా చేపిస్తున్నారు. దుబ్బాక-హబ్సీపూర్ రహదారిలో రామసముద్రం చెరువు కట్ట పక్కన నాలుగు ఎకరాల స్థలంలో సమీకృత భవనాన్ని నిర్మిస్తున్నారు. జీ ప్లస్ వన్ భవనంలో సుమారు 26 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు కొనసాగించేందుకు భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించడంతో ఇందులో తహసీల్ కార్యాలయం, పంచాయతీరాజ్, అటవీశాఖ, ఆర్అండ్బీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ కా ర్యాలయాలకు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రానున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇందులోనే రిటర్నింగ్ కార్యాలయాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ దిశగా వేగంగా పనులు చేపడుతున్నారు. కార్యాలయంలో మీటింగ్ హాల్, పలు శాఖలకు సంబంధించిన చాంబర్లు, మరుగుదొడ్లు నిర్మించారు. ఫర్నిచర్‌తో పాటు ఎలక్ట్రిసిటీ, తాగునీరు కనెక్షన్లు, కార్యాలయానికి వెళ్లేందుకు అంతర్గత రోడ్డు, రోడ్డుకు ఇరుపైపులా మొక్క లు నాటే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. త్వరలోనే సమీకృత కార్యాలయ (ఐవోసీ)భవనాన్ని మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించడానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషిచేస్తున్నారు. నెల రోజులుగా భవన నిర్మాణ పనులు వాయివేగంతో కొనసాగుతున్నాయి. ఈ భవన నిర్మాణ పనులపై కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పలుమార్లు సందర్శించి పర్యవేక్షించారు.
ఐవోసీ భవనంతో సేవలు వేగిరం..
పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత కార్యాలయాలు(ఐవోసీ) భవనాలు నిర్మిస్తున్నారు. ఒకేచోట అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలకు సేవలు వేగంగా అందే అవకాశం ఉంది. సమైక్య పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె కొంపల్లో కొనసాగాయి. సౌకర్యాలు ఉండకపోయేవి. అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న పాత భవనాల్లో ప్రభుత్వ కార్యాయాలు కొనసాగడంతో ప్రజలతో పాటు అధికారులు ఇబ్బందులు పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని శాఖలకు పక్కా భవనాలు నిర్మిస్తుండడంతో యంత్రాంగానికి సౌకర్యంగా మారనున్నది. దుబ్బాక ఐవోసీ భవనంలో 26 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఒకేచోట కొనసాగేలా పనులు చేపడుతున్నాం. త్వరలోనే పనులు పూర్తిచేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ