గజ్వేల్, ఏప్రిల్ 29: నీళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన నిజమైన నాయకుడు మన సీఎం కేసీఆర్ అని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కుకునూర్‌పల్లి మండలం మంగోల్ వద్ద కామారెడ్డి జిల్లాకు వెళ్లే 17వ ప్యాకేజీ కాల్వ పనులను జుక్కల్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, మదన్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.మల్లన్నసాగర్ నుంచి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే కాల్వ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ కట్టపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాకముందు గోదావరి నీళ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలో తెలియని పరిస్థితి ఉండేది. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికే భూంపల్లి కాల్వ తవ్వితే చుక్కనీరు తెచ్చింది లేదన్నారు.’ కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అప్పట్లో పనులు అప్పగించారని గుర్తుచేశారు.
ఇబ్బందులు అధిగమించి ప్రాజెక్టులు పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పూర్తి చేసుకొని వరుస క్రమంలో అనంతసాగర్, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ పూర్తి చేశారన్నారు. వీటన్నింటి ద్వారా 18లక్షల 75వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడమే కాకుండా మరో 40లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాజెక్టుతో లబ్ధి చేకూరుతున్నదన్నారు. మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ వరకు కాల్వ ద్వారా 6వేల క్యూసెక్కుల నీళ్లు హల్దీవాగు ద్వారా సింగూర్, నిజాంసాగర్‌కు చేరుతాయని, దీంతో రెండు పంటలకు సాగుకు అనుకులంగా ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి 2021లో నిజాంసాగర్‌లోకి నీళ్లు వదలడంతో రెండు పంటలను కామారెడ్డి జిల్లా రైతులు పండించుకున్నారని గుర్తుచేశారు. మల్లన్నసాగర్‌తో అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలవుతున్నదన్నారు. నిజాంసాగర్ కంటే మూడింతలు పెద్దదైన మల్లన్నసాగర్‌ను చూస్తే బాగుందని కితాబిచ్చారు. వర్షాలు పడకున్నా ఏడాది పాటు నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మల్లన్నసాగర్, అనంతసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్‌తో రైతులకు సాగునీరు అందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసే సమయంలో మూడేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెబితే అందరం ఆశ్చర్యపోయామని, ఆయన చేసిన పనులను చూస్తే తామే నమ్మలేదన్నారు.
ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా..
తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలబడిందని, ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మల్లన్నసాగర్ నుంచి హల్దీవాగులోకి వెళ్లే కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు స్పీకర్ సూచించారు. ఇంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు జీవించాలన్నారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ మురళీధర్, సీఈ, ఎస్ఈ వేణు, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవీరవీందర్, గజ్వేల్ యూత్ విభాగం అధ్యక్షుడు స్వామిచారి, సర్పంచ్‌లు కిరణ్, మహిపాల్, ఎంపీటీసీ భూములుగౌడ్, బొల్లారం ఎల్లయ్య, గజ్వేల్ యూత్ విభాగం అధ్యక్షుడు స్వామిచారి, అహ్మద్, నాయకులు కరుణాకర్, కనకయ్య, రుషి, పాల శంకర్, రవీందర్ పాల్గొన్నారు.
గజ్వేల్‌లో స్వాగతం పలికిన నాయకులు
గజ్వేల్ మండలం క్యాసారం వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం పనులను పరిశీలించి అధికారుల ద్వారా పోచారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. గజ్వేల్ వద్ద నిర్మాణంలో ఉన్న కాల్వను పరిశీలించారు. మండలంలోని గిరిపల్లి వద్ద సొరంగంలోకి అధికారులతో కలిసి వెళ్లి పనులను తనిఖీ చేశారు. అంతకుముందు మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. కుకునూర్‌పల్లి మండలానికి చెందిన సర్పంచ్‌లు, నాయకులు శాలువలతో సన్మానించారు. క్యాసారం వద్ద బొట్టుపెట్టి కౌన్సిలర్ బాలమణి, శాలువతో వైస్ చైర్మన్ జకీయొద్దిన్ స్వాగతం పలికారు.