
వెల్దుర్తి, జనవరి 1: విదేశాల్లో స్థిరపడిన ఆమె పుట్టినూరులోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేయూత ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మాసాయిపేటకు చెందిన మాధవి. ఉన్నత విద్య అభ్యసించి లండన్‌లో వైద్యురాలిగా స్థిరపడింది. స్వగ్రామానికి ఏదైనా చేయాలన్న కోరికతో భర్త శ్రీకాంత్‌తో కలిసి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గతంలో పాఠశాలకు 60 బెంచీలు అందజేసిన మాధవి, శ్రీకాంత్ దంపతులు, ప్రస్తుతం మరో 50 బెంచీలు అందజేశారు. పాఠశాలకు మరమ్మతులు చేయించారు. రంగులు వేసి, తరగతి గదుల్లో తెలుగు, ఆంగ్ల అక్షరమాల, గుణితాలు, అంకెలు, జిల్లా, రాష్ట్ర పటాలు, రాష్ట్ర చిహ్నాలు, పండ్లు, కూరగాయలు, ఇతర రంగురంగుల బొమ్మలు వేసి అందంగా తీర్చిదిద్దారు. పాఠశాలలో విద్యుత్ సరఫరా, లైట్లు, ప్యాన్లు, ఇతర కార్యాలయ ఫర్నిచర్‌ను సమకూర్చారు.పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సైన్స్ పరికరాలు భద్రపరిచేందుకు బీరువాలు అందజేశారు. పాఠశాల పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో సోమవారం జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ చేతులమీదుగా ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలో సైన్స్‌ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న మాధవి, శ్రీకాంత్ దంపతులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.