రామాయంపేట, జనవరి 9 : మహిళలకు పుత్తడిపై మక్కువ ఎక్కువ. పండుగలు, శుభకార్యాల్లో ఉన్నంతలో బంగారు నగలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కాని మార్కెట్లో పసిడి ధరలు భగ్గుమనడంతో వేసుకున్న నగను మళ్లీమళ్లీ వేసుకోలేక చాలా మంది మహిళలు ఇటీవల కాలంలో వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు బంగారాన్ని తలదన్నేలా మిరిమిట్లు గొలపడమేగాక ఆకట్టుకున్న డిజైన్లలో కలర్ గ్యారెంటీతో వస్తున్న ఈ ఇమిటేషన్ జ్యూయెల్లరీపై ఇటీవలి కాలంలో యువతుల నుంచి ఇంతుల దాకా మనసు పారేసుకుంటున్నారు.
డిమాండ్ నేపథ్యంలో జిల్లాకేంద్రం మొదలు కొని అన్ని ముఖ్య పట్టణాలు, ఆఖరికి మండల కేంద్రాల్లో సైతం వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాల షాపులు విరివిగా వెలుస్తున్నాయి. వాటి నిర్వాహకులు మగువల అభిరుచికి తగినట్లుగా రకరకాల వెరైటీలను తక్కువ ధరలకే అందుబాటులో ఉంచుతున్నారు.
అన్ని ఆభరణాలు
తలలో పాపిట బిల్ల మొదలు, కాళ్ల పట్టీల దాకా అన్ని భరణాలు, అనేక వెరైటీల్లో లభ్యమవుతున్నాయి. చంద్రహారం, వంకలు, పాపిట బిళ్లలు, గులాబీ హారాలు, మంగళసూత్రాలు, గాజులు, చంద్రముఖి హారం, జడ కుచ్చులు, కెంపుల హారం, వడ్డాణం, కుందన్ ఉంగరాలు, పూసల దండలు, బ్రాస్లెట్లు, మెడలో వేసుకునే చైన్‌తోపాటు కాళ్ల పట్టీల్లో కావలసిన డిజైన్లును ఎంచుకోవచ్చు. ఇవన్నీ అసలు బంగారు నగలకు ఏమాత్రం తీసిపోవంటే అతిశయోక్తి కాదు. వెరైటీలు నాణ్యతను బట్టి ధరలుంటాయి. బంగారు నగలను కొనలేనివారు ఇంట్లో ఇప్పటికే ఉన్న నగలపై మోజు తీరినవారు వన్‌గ్రామ్ ఆభరణాలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
అందుబాటులో ధరలు
కమ్మలు రూ.190 నుంచి రూ.2500 వరకు, నక్లెస్‌లు 350 నుంచి రూ.5500 వరకు, మువ్వల నక్లెస్‌లు రూ.350 నుంచి రూ.750 వరకు, మువ్వల హారాలు రూ.850 నుంచి 2200 వరకు, వసంత హారాలు రూ.850 నుంచి రూ.2500 వరకు, వడ్డాణం రూ.2500, ముత్యాల దండలు రూ.330 నుంచి 2550 వరకు, చెంప స్వరాలు రూ.150 నుంచి రూ.850, గుండ్ల హారాలు రూ.1150 నుంచి రూ.5550, రుబీస్ ముత్యాలు, హానెక్సు నల్లపూసలు, కమ్మలు, గొలుసులు రూ.190 నుంచి రూ.850, పుస్తెల తాడులో 35 రకాలు ఉండగా రూ.290 నుంచి రూ.1200 వరకు, క్లిప్స్ రూ.130లకు మార్కెట్లో లభిస్తున్నాయి.
ఆన్లైన్లో విక్రయాలు
ఎక్కువ శాతం ఆన్లైన్లోనే కూడా రకరకాల డిజైన్లు లభిస్తున్నాయి. ఆర్డర్‌పై కొనుగోలు చేస్తున్నాం. మాకు అవసరం ఉన్న వాటిని ఆన్లైన్లో చూసి ధరలను బట్టి వివిధ రకాల చైన్లను కొంటున్నాం. ధరలు కూడా పెద్దగా అనిపించడం లేదు. అందుకే బంగారం కన్నా వన్‌గ్రామ్ గోల్డ్ మీదనే మక్కువ చూపుతున్నాం.
–పుట్ట భవాని, రామాయంపేట
ఆకర్షణీయంగా ఉంటాయి
వన్‌గ్రామ్ గోల్డ్ నగలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. చూడగానే కొనాలని పిస్తుంది. ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాం. గోల్డ్ కన్నా చాలా అందంగా మెడలో వేసుకుంటే బంగారంలా మెరిసిపోతాయి. – సాప ప్రీతి, రామాయంపేట