హాజరైన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్
ఇక్రిశాట్ లోగో, స్టాంప్ ఆవిష్కరణ
స్టాళ్లను పరిశీలించిన ప్రధాని
భారీ పోలీస్ బందోబస్తు
ప్రశాంతంగా ముగిసిన కార్యక్రమం
సంగారెడ్డి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఇక్రిశాట్ డైరెక్టర్ జాక్వెలిన్ హ్యూస్ వేడుకల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నరేంద్రమోదీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఇక్రిశాట్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రధానికి హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ నేరుగా ఇక్రిశాట్లో స్వర్ణోత్సవ వేడుకల వేదిక వద్దకు చేరుకున్నారు. 50 ఏండ్లలో ఇక్రిశాట్ చేసిన పరిశోధనలు, ఆవిష్కరించిన కొత్త వంగడాలు, నీటి యాజమాన్య పద్ధ్దతులపై ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ప్రధాని సందర్శించారు. అనంతరం ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని రూపొందించిన లోగోను ఆవిష్కరించారు. ఆ తర్వాత తపాలాశాఖ రూపొందించిన ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేశారు. ైక్లెమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్‌ను, ర్యాపిడ్ జెన్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత ఇక్రిశాట్లో కొనసాగుతున్న అధునాతన సాగు పద్ధతులు, పంటల సాగును ప్రధాని పరిశీలించారు.
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం మోదీ తిరిగి 4.47 గంటలకు ఇక్రిశాట్ నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. ప్రధాని రాక సందర్భంగా ఇక్రిశాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు బందోబస్తులో పాలుపంచుకున్నారు. రెండు రోజులుగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో స్థానికులు ప్రధాని పర్యటన గురించి ఆసక్తి కనబర్చారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు ఇక్రిశాట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా సమస్యలు తల్తెకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్రిశాట్లోకి ఆహ్వానితుల వాహనాలను మినహాయించి ఎవరి వాహనాలనూ అనుమతించలేదు. ప్రధాని తిరుగుపయనం అవుతున్న సందర్భంలో హెలిక్టాపర్ను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.