చేర్యాల, మే 27 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ నిర్వాహకులు రైతులను నిట్టనిలువునా దోచుకుంటున్నారు. ధాన్యం తూకం వేసే ఎలక్ట్రానిక్ కాంటాలను సెట్ చేసి క్వింటాల్‌కు రెండున్నర కిలోలు కొట్టేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం మర్రిముచ్చాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎలక్ట్రానిక్ కాంటా సెట్టింగ్‌ను గుర్తించి నిర్వాహకులను నిలదీస్తే దోపిడీగుట్టురట్టయ్యింది.
మర్రిముచ్చాల ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రంలో ఇప్పటి వరకు 8వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశారు. నిర్వాహకులు 40కిలోల బస్తాకు మరో కిలో అదనంగా వచ్చే విధంగా ఎలక్ట్రానిక్ కాంటా సెట్ చేశారు.41కిలోలు ఉన్న బస్తాను కాంటాపై పెడితే అది 40కిలోలు మాత్రమే చూపించే విధంగా చర్యలు తీసుకున్నారు.
కేంద్రానికి వచ్చిన పలువురు రైతులు ఇటీవల ప్రైవేట్ కాంటా వద్దకు కేంద్రంలో 40కిలోలు తూకం వచ్చిన బస్తాను తీసుకువెళ్లి తూకం వేస్తే అక్కడ 41కిలోల బరువు చూపించింది. అనంతరం రైతులు కేంద్రం వద్దకు వచ్చి 20కిలోల తూనిక రాయిని పెట్టి తూకం వేయగా 19కిలో ల500 గ్రాములు బరువు ఉన్నట్లు చూపించింది. దీంతో రైతులు కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన నిర్వాహకులు తూకం వేసే కాంటా మరమ్మతుకు వచ్చిందని, దాన్ని ఉపయోగించవద్దని మెకానిక్ సైతం తెలియజేశాడన్నారు.
200 క్వింటాళ్ల ధాన్యం స్వాహా?
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొందరు ఎలక్ట్రానిక్ కాంటాలను ఉపయోగిస్తున్నారు.సదరు కాంటాలు ఉపయోగిస్తున్న కేంద్రాల్లో రైతుల నుంచి 40కిలోలకు మరో కిలో అదనంగా దోచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ కాంటాలో తూకం వేస్తే రైతులు క్వింటాల్‌కు రెండున్నర కిలోల ధాన్యం నష్టపోతున్నారు. ఇదే కేంద్రంలో ఒక రోజు 903 ధాన్యం బస్తాలను నిర్వాహకులు కొనుగోలు చేసి మద్దూరు మండలంలోని ఓ రైస్‌మిల్లుకు పంపిన ట్రక్ షీట్లో మాత్రం 914 బస్తాలుగా నమోదు చేశారు.
ఒక్క రోజు నిర్వాహకులు కొనుగోలు చేసిన బస్తాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు 8వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.అంటే ఒక్కో క్వింటాల్‌కు రెండున్నర కిలోలు నష్టం లెక్కిస్తే ఇప్పటి వరకు రైతులు 200 క్వింటాళ్ల వరకు నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న పౌరసరఫరాలశాఖ మేనేజర్ ప్రవీణ్, సెర్ప్ అదనపు పీడీ మధుసూదన్, డీపీఎం కరుణాకర్, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.అధికారులు విచారణలో ఇప్పటి వరకు 225 బస్తాల ధాన్యం పక్కదారి పట్టినట్లు తేల్చారు.ఎలక్ట్రానిక్ కాంటాలో సెట్ చేశారనే విషయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో ఉన్న కాంటాలను సైతం సీజ్ చేశారు. ప్రాథమికంగా అధికారులు సీసీతో పాటు వీఏవోపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
మిల్లర్లు, నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలి
బీఆర్ఎస్ పాలనలో రైతులను రాజుగా తయారు చేస్తే కాంగ్రెస్ సర్కారు పాలనలో అన్నదాతను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం మర్రిముచ్చాల ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రాల్లో రైతుల ధాన్యం దోచుకుంటున్న నిర్వాహకులతో పాటు కుమ్మక్కైన మిల్లరు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి ధాన్యం నష్టపోయిన రైతులకు న్యాయంగా రావాల్సిన డబ్బులను అధికారులు చెల్లించాలి.
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి