సంగారెడ్డి, మార్చి17(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను సోమవారం జర్మనీలోని పలు విశ్వవిద్యాలయాల అధిపతులు, అకడమిక్ ఎక్చేంజ్ సర్వీస్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. జర్మనీ బృందం ప్రతినిధి జనరల్ సెక్రటరీ డాక్టర్ కైసిక్స్, జర్మన్ కాన్సులేట్ జనరల్ కాథరిన్ మసెరా లాంగ్, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, జర్మనీ-ఐఐటీహెచ్ అకడమిక్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌పై చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కైసిక్స్ మాట్లాడుతూ.. జర్మనీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, విద్యార్థులు అకడమిక్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐఐటీహెచ్‌కు రానున్నట్లు తెలిపారు. జర్మనీ,ఐఐటీహెచ్ విద్యార్థులు కలిపి ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు జరపనున్నట్లు చెప్పారు. జర్మన్ కాన్సులేట్ జనరల్ కాథరిన్ మసెరా లాంగ్ మాట్లాడుతూ.. జర్మనీ, భారత్ అనేక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో జర్మనీలోని విశ్వవిద్యాలయాలు, భారత్‌లోని విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీహెచ్‌ను జర్మన్ బృందం సందర్శించి అకడమిక్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌పై చర్చలు జరపడం సంతోషంగా ఉందన్నారు. విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణలపై కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇండో-జర్మన్ సంబంధాల బలోపేతానికి ఐఐటీహెచ్ తనవంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అధ్యాపక, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాల ద్వారా రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. త్వరలోనే ఐఐటీహెచ్‌లో ఇండో-జర్మన్ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయన్నుట్లు తెలిపారు. తద్వారా ఆవిష్కర ణలు, పరిశోధనల్లో ఇరుదేశాలకు మేలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జర్మనీ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, జర్మనీ ప్రతినిధులు ప్రొఫెసర్ గెసిన్ గా రండే, డ్యూయిస్ బర్గ్, క్రిస్టియన్ జోసఫ్, మార్టిన్, ఆడ్రియాస్ మార్క్, అలివర్ ఫ్రోర్, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు తరుణ్ కాంతి పాండా, ప్రేమ్‌పాల్, మయూర్ తదితరులు పాల్గొన్నారు.