కంది, జనవరి 21: సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్లో మంగళవారం పాన్ ఐఐటీ వల్డ్ టెక్నాలజీ సాటిలైట్ 2025 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్నోవేషన్, స్మార్టర్ వరల్డ్-ఏఐ, ఇండస్ట్రీ 5.0 అంశాలపై కార్యక్రమం కొనసాగింది. దేశంలోని ప్రధాన సంస్థలు, ప్రపంచ సాంకేతిక ప్రగతులు, ప్రాదేశిక, గ్లోబల్ సమస్యల పరిష్కారాలను వివరించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో పాటు ఐఐటీ ప్రతినిధులు, స్టార్ట్-అప్ ఏజెంట్లు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో కీలక సమస్యలను పరిష్కరించడం, ఆరోగ్య జాగ్రత్తలు, ఇంటర్నెట్ అవసరం లేకుండా విద్యను అందించడంపై ప్రసంగాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక పురోగతికి ఐఐటీహెచ్ చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రముఖులు, పెట్టుబడిదారులు, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.