మెదక్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులు, వాటి సేవలను పొందే హకు వినియోగదారుడికి ఉంటుందని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. ఒక వేళ వినియోగదారుడు మోసపోయినట్లు భావిస్తే జిల్లా వినియోగదారులు ఫోరమ్‌ను సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు. శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కమిషన్లలోని కేసులను సమర్థవంతంగా పరిషరించడం అనే థీమ్‌తో వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నామన్నారు. నేటి డిజిటల్ యుగంలోనూ వినియోగదారులు అనేక రూపాల్లో మోసపోతున్నారన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు విద్యావంతులు, యువత కూడా మోసపోతున్నారన్నారు. ప్రజలు వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆ వస్తువు నాణ్యత, పరిమాణం, పని తీరు, ధరను పరిశీలించాలని సూచించారు.
పెట్రోల్, గ్యాస్, తూకాల్లో మోసం, ఆహార ధాన్యాల్లో కల్తీ, భూములు, మెడిసిన్స్, బంగారం కొనుగోలులో మోసాలు ఇలా ఎకడ చూసినా ఎన్నో తెలియని మోసాలు జరుగుతున్నాయన్నారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ తదితర విధానాల్లో వస్తువులు కొని మోసపోతున్నారన్నారు. మోసానికి గురయ్యామని భావిస్తే వినియోగదారుల ఫోరమ్‌ను సంప్రదించాలని, వారికి రక్షణగా ప్రభుత్వం వినియోగదారుల హకుల పరిరక్షణ చట్టం-2019ను రూపొందించిందని అన్నారు. ఈ చట్టం ద్వారా ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులను జవాబుదారులుగా చేస్తూ నష్టపరిహారం, జరిమానాతో పాటు, జైలుకు పంపించడానికి అవకాశం ఉన్నదన్నారు. వస్తువు నాణ్యతా లోపాలున్నప్పుడు వారంటీతో సంబంధం లేకుండా నష్ట పరిహారం పొందవచ్చన్నారు. వస్తువు ఎకడ కొన్నా ఎకడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సేవా రంగంలో లోపాలున్నా ఫిర్యాదు చేయవచ్చన్నారు. తూనికలు, కొలతల శాఖ వారు తరచూ దాడులు చేస్తే వ్యాపారస్తుల్లో భయం ఉండి తప్పు చేయడానికి జంకుతారన్నారు. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉంటే మోసాలను అరికట్టవచ్చన్నారు.
ఈ దిశగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చాలని అధికారులకు సూచించారు. వినియోగదారుల సౌకర్యార్థం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ BIS CARE APP ను రూపొందించిందన్నారు. జిల్లాలో మంజీరా బ్రాండ్ పేర నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను మారెటింగ్ చేస్తున్నామని, వాటిని కొనుగోలు చేసి చేయూతనందించాలని కోరారు. సమావేశంలో డీఎస్వో శ్రీనివాస్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్, తూనికలు, కొలతల శాఖాధికారి సుధాకర్, అడిషనల్ డీఆర్డీవో భీమయ్య, వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.