ఆదర్శంగా నిలుస్తున్న మల్లికార్జునపల్లి ప్రభుత్వ పాఠశాల
ప్రవేశపరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలుస్తున్న విద్యార్థులు
స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సహకారంతో సౌకర్యాలు
సర్కారు బడిలోనే వారి పిల్లలను చదివిస్తున్న ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల కృషి, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మల్లికార్జున పల్లి పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఎదిగింది. ఈ పాఠశాల విద్యార్థులు నవోదయ, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలుస్తూ సత్తా చాటుతున్నారు. మునిపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాలలు (31), ప్రాథమిక ఉన్నత (8), జిల్లా పరిషత్ (12) సర్కారు బడులున్నాయి. కాగా, మల్లికార్జునపల్లి పాఠశాల విద్యావిధానంలో ఆదర్శంగా నిలుస్తున్నది. డిజిటల్ విధానంతో విద్యాబోధన చేస్తుండడంతో పాఠశాలలో చేరేందుకు ప్రైవేట్ విద్యార్థులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఉపాధ్యాయులు సైతం వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న ‘మనఊరు- మనబడి’లో భాగంగా ఆంగ్ల విద్యా విధానాన్ని అమలు చేస్తే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగనున్నది. – మునిపల్లి, ఫిబ్రవరి 8
ఆదర్శ పాఠశాల దిశగా మునిపల్లి మండలంలోని మల్లికార్జునపల్లి ప్రాథమిక పాఠశాల పరుగులు పెడుతున్నది. మల్లికార్జునపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేకంగా విద్యాబోధన చేస్తుండడంతో నవోదయ, మోడల్ స్కూళ్లల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో ఎక్కువగా ఈ పాఠశాల నుంచే విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. మల్లికార్జునపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు చంద్రమౌళి ప్రత్యేక కృషితో పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. సాధారణ బోధన కంటే డిజిటల్ (స్క్రీన్)పై బోధించడం ద్వారా విద్యార్థులు పాఠాలను త్వరగా అర్థం చేసుకుంటారు. డిజిటల్ బోధనతో సర్కారు విద్య బలోపేతం కానున్నది.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో..
మల్లికార్జునపల్లి ప్రాథమిక పాఠశాలకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ఉచితంగా అనేక రకాల క్రీడాసామగ్రితో పాటు కంప్యూటర్లు అందిస్తూ, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సర్కార్ బడికి తోడుగా ఉంటున్నారు. గతంలో ఎన్వీ లక్ష్మి ఫౌండేషన్ వారు పాఠశాలకు 30 బెంచీలు, హుందై కంపెనీ వారు ఆట వస్తువులతో పాటు క్రీడా సామగ్రి, రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ వారు లైబ్రరీ బుక్కులు, కంప్యూటర్లు, ఆట వస్తువులు, పాఠశాలకు రంగులు, ష్యూ, టై, బెల్ట్లు ఉచితంగా అందించారు. మల్లికార్జునపల్లికి చెందిన కార్తీక్ కృషితోనే స్వచ్ఛంద సంస్థలు పాఠశాలకు అండగా నిలుస్తూ అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ బడిలో విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుల పిల్లలు సైతం మల్లికార్జునపల్లి ప్రభుత్వ బడిలో చేర్పించి చదివిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తున్నారు.
చదువు మంచిగ చెబుతున్నారు..
ఇంతకు ముందు సదాశివపేటలోని ఓ ప్రైవేట్ బడిలో చదువుకునేందుకు కొద్ది రోజులు వెళ్లాను. అప్పటి కంటే ఇప్పుడు సర్కార్ బడిలో ఉపాధ్యాయులు చదువు చాలా మంచిగా చెబుతున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నా. ఉపాధ్యాయులు ఎక్కువ సేపు పాఠశాల తరగతిలో ఉన్న విద్యార్థులతోనే ఉంటారు. ఏదైనా సందేహం వస్తే ఉపాధ్యాయులను అడిగిన వెంటనే చెబుతున్నారు. మాకు ప్రభుత్వ పాఠశాలలో అన్నిరకాల సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. – శ్రేష్ట, 1వ తరగతి, మల్లికార్జునపల్లి పాఠశాల (ఉపాధ్యాయుడి కూతురు)