మెదక్, డిసెంబర్ 16 : రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పుల పక్రియకు మెదక్ జిల్లాలో భారీ స్పందన వచ్చింది. ఇచ్చిన గడువు నవంబర్ 30తో ముగిసిన విషయం తెలిసిందే. 2022లో ఓటరు నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు ఈ నెల 20 వరకు పరిశీలన చేయనున్నారు. అనంతరం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. జనవరి 5న ఓటరు తుది జాబితా ప్రకటించనున్నారు. నాలుగు నెలలుగా ఓటు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమాలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు తుది జాబితా రూపొందించి జనవరిలో విడుదల చేయనున్నారు.
మెదక్ జిల్లాలో 4,13,517 మంది ఓటర్లు…
ఓటరు నమోదుపై అధికారులు అవగాహన కల్పించారు. నాలుగు రోజుల్లో నవంబర్ 6,7,27,28 తేదీల్లో ప్రత్యేక ప్రచారం చేశారు. జిల్లాలో 576 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు 2,917 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2022 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండి అర్హత గల ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం నమోదు కార్యక్రమాలు చేపట్టారు.
మొదటి సారి గరుడ యాప్‌లో నమోదు..
మొదటిసారిగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ కొత్తగా గరుడ యాప్‌ను రూపొందించింది. బీఎల్వోలకు అవగాహన కల్పించి దాని ద్వారా ఓటరు నమోదు చేపట్టారు. బీఎల్వోలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో గరుడ యాప్ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు.
ఓటరు జాబితా తయారీకి కసరత్తు…
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కలెక్టర్‌తో పాటు ఎన్నికల విభాగం, రెవెన్యూ అధికారులు నాలుగు నెలలుగా ఓటరు జాబితా తయారీకి కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు నుంచి అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదుతో పాటు పోలింగ్ కేంద్రాల మార్పులు, జాబితా నుంచి తొలిగింపులు, చిరునామా మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరించారు. బీఎల్వోలు, ఎన్నికల విభాగం సిబ్బంది ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలు నిర్వహించి అర్హత గల యువతను జాబితాలో చేర్చారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి ఎన్ఈసీ ఆదేశాల మేరకు ముసాయిదా జాబితా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు 2,917 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించే పనిలో అధికారులు నిగమ్నమయ్యారు
గరుడ యాప్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు..
మొదటిసారిగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ కొత్తగా గరుడ యాప్‌ను రూపొందించింది. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లు 2022 జనవరి ముసాయిదా జాబితాలో ప్రకటిస్తారు. మెదక్ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,917 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 20 వరకు పరిశీలన చేసి జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తాం. – రమేశ్, అదనపు కలెక్టర్ మెదక్