గజ్వేల్, సెప్టెంబర్ 28: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పడ్డ గుంతలతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజు ఇదే మార్గంలో రామాయంపేట, దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. ప్రతి రోజు ఆయా గ్రామాల నుంచి పైచదువుల కోసం విద్యార్థులు ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో గజ్వేల్‌కు వస్తుంటారు. ఇదే మార్గంలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఉండడంతో ప్రతి రోజు చాలా మంది రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వెళ్తారు.
ముట్రాజ్‌పల్లి వెళ్లే మార్గంలో మహతి అడిటోరియం ముందు రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. మహతి ఆడిటోరియం ముందు రోడ్డుపైనే భారీ వర్షాలకు నీళ్లు నిలుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా తారు లేచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వీటితో పాటు రోడ్లపై భారీ వర్షాలకు ఏర్పడిన గుంతల మరమ్మతులు చేయడంలో అధికారులు చొరవ చూపడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెంటనే గుంతల రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.