సిద్దిపేట అర్బన్/నంగునూరు, ఏప్రిల్ 10: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం వేకువజామున కురిసిన వడగండ్ల వర్షం రైతులకు కడగండ్లను మిగిల్చింది. అకాల వర్షానికి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. నంగునూరు, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్ మండలాల్లో అకాల వర్షానికి భారీగా పంటలు దెబ్బతిన్నాయి. నంగునూరు మండలంలోని పాలమాకుల, రాజగోపాల్‌పేట, మైసంపల్లి, ముండ్రాయి, నర్మెట, వెంకటాపూర్, కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, రాంపూర్, మగ్ధూంపూర్, అంక్షాపూర్, సిద్దన్నపేట, జేపీ తండా, బద్దిపడగ గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు కూలడంతో కొన్ని గ్రామాల్లో పాక్షికంగా ఇండ్లు సైతం దెబ్బతిన్నాయి. పంట చేతికందే సమయానికి వడగండ్ల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
నంగునూరు మండల వ్యాప్తంగా అకాల వడగండ్ల వర్షానికి సుమారు 3,869 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో పాలమాకులలో 1,010 ఎకరాలు, ముండ్రాయి 602 ఎకరాలు, ఖానాపూర్ 310, వెంకటాపూర్ 320, కోనాయిపల్లి 150, తిమ్మాయిపల్లి 102, రాజ్‌గోపాల్‌పేట 520, మైసంపల్లి 300, నర్మెట గ్రామంలో 280 ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పంట పొలాలను మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం ఉదయం పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పా రు. నంగునూరు మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో వడగండ్ల వానతో రైతులను తీవ్ర నష్టం జరిగిందని, ఎకరాకు రూ. 20 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, ఏడీఏ పద్మక, మండల వ్యవసాయ అధికారి గీత, ఏఈవోలు, ఉద్యానవన అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 10: మద్దూరు మండలంలోని నర్సాయపల్లిలో గురువారం తెల్లవారుజామున 4గంటలకు సుమారు గంట పాటు వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్ల వర్షానికి వరి పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో సుమారు 100 ఎకరాలకుపైగా వరి పంటకు నష్టం జరిగింది. పంటలు దెబ్బతిని నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.
చిన్నకోడూరు, ఏప్రిల్ 10: వడగండ్ల వానకు చిన్నకోడూరు మండలంలో వరి, మొకజొన్న, కీరదోస, మిర్చి, మామిడి తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మండల కేంద్రమైన చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్, మెట్పల్లి, సెలంద్రీ, ఎల్లమ్మజాలు, ఎల్లాయ్పల్లి, చెలలపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం, మాజీ వైస్ ఎంపీపీ పాపాయ్య, మాజీ సర్పంచ్‌లు శంకర్, మహేందర్, నాయకులు కార్తీక్, వ్యవసాయ అధికారులు, ఏఈవోలు గురువారం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మండలంలోని 9 గ్రామాల్లో 1230మంది రైతులకు చెందిన 2110 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.
చేర్యాల, ఏప్రిల్ 10: అర్జునపట్ల, కమలాయపల్లి గ్రామాల్లో వేకువజామున వడగండ్ల వాన కురిసింది. కమలాయపల్లిలో 55 ఎకరాల్లో, అర్జునపట్లలో 10 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.