మెదక్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి జిల్లా అస్తవ్యస్తమైంది.విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో 260 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. కొన్ని ట్రాన్స్ఫార్మర్లు కిందపడిపోగా, దుమ్మెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సుమారు 1000 స్తంభాలు విరిగిపోయాయి. 11 కేవీ, 33 కేవీ, ఎల్టీ లైన్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 4 ట్రాన్స్ఫార్మర్లు వాగులో కొట్టుకుపోయాయి. మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటాల్ సబ్ స్టేషన్ నీట మునిగింది. దీంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను పక్క ఫీడర్‌తో పట్టణ ప్రజలకు కరెంటును సరఫరా చేశారు. హవేళీఘనపూర్ మండలం ఔరంగాబాద్, తొగిట, ఫరీద్పూర్, పాతూర్, పాతూర్ తండా గ్రామాలకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్ సరఫరా నియంత్రణకు రూ.7.30 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు ట్రాన్స్‌కో ఎస్ఈ నారాయణనాయక్ తెలిపారు. ఇందులో పిల్లికోటాల్ సబ్‌స్టేషన్‌కు రూ.3.50 కోట్లు కాగా, రూ.3.80 కోట్లతో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, ఇతర పనులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు ఎస్ఈ పేర్కొన్నారు.