సిద్దిపేట అర్బన్, ఆగస్టు 12: తెలంగాణ వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ట్రైబల్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి ఆధ్వర్యంలో జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గిరిజన యువత వ్యాపారరంగంలో ఎదగడానికి ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు.
కష్టపడితే ఎవరైనా విజయాలు సాధించవచ్చన్నారు. నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ పాఠశాలలో చదివిన రమేశ్ నాయక్ అనే గిరిజన బిడ్డ లండన్‌లో 16 హోటళ్లు స్థాపించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల అభివృద్ధి కోసం వందల కోట్ల సబ్సిడీలు ఇస్తూ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారుచేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. గిరిజనులకు విద్య,ఉద్యోగాల్లో 6 నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్లు పెంచామన్నారు.
ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను రైతులుగా మార్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి అధికారంలోని వచ్చిన రేవంత్‌రెడ్డి ఇవాళ లక్ష ఎకరాల అసైన్డ్ భూములు గుంజుకొని పేదలను రోడ్డున పడేశారన్నారు. లగచర్లలో భూములు ఇవ్వమని అడిగిన పాపానికి లంబాడీ బిడ్డలను జైలులో ఉంచారన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో టిక్కీ యజమానులు పాల్గొన్నారు.