నంగునూరు, జూన్ 25 : నర్మెట వద్ద నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఆసియా ఖండంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట గ్రామ శివారులో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఏవిధంగా జరుగుతున్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతుందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చొరవతో రూ.300 కోట్లతో ఫ్యాక్టరీ నెలకొల్పామన్నారు. ఆయిల్ తయారు చేసి ప్యాకింగ్ కూడా ఇక్కడే చేస్తారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఒక వరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రతి ఏడాది పది కోట్ల లీటర్ల నీరు ఈ ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆయిల్‌పామ్ సాగు చేయడం ద్వారా ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. కరువు ప్రాంతం లో ఆయిల్‌పామ్ సాగు అయ్యిందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు. ప్రభుత్వ జీతం వచ్చినట్లే నెలా నెలా రైతులకు ఆదాయం వస్తుందన్నారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో 3 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట దిగుబడి ప్రారంభమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందన్నారు.
గతంలో మూడు నల్లచట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుందన్నారు. ఇప్పుడు ఆయిల్‌పామ్ రైతులకు తీవ్రనష్టం చేస్తుందన్నారు. కార్పొరేట్లు, రిఫైనరీలకు లాభం చేకూరే విధంగా దిగుమతి సుంకం తగ్గించి ఆయిల్‌పామ్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. దిగుమతి సుంకం 27 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి కార్పొరేట్లకు లాభం చేయడం ద్వారా ఆయిల్‌పామ్ ధరలు పడిపోయాయన్నారు. ప్రతి ఏడాది లక్ష కోట్ల ఆయిల్‌పామ్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నామని, తక్షణమే కేంద్రం తగ్గించిన సుంకాన్ని యథాస్థితికి తేవాలని డిమాండ్ చేశారు.
దిగుమతి సుంకం తగ్గించి రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. ఆగస్టు రెండో వారంలో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందన్నారు. ఆయిల్‌పామ్ రైతులకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు వెంటనే చెల్లించాలని, రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్‌కు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, కృష్టారెడ్డి, సారయ్య, పురేందర్ తదితరులు పాల్గొన్నారు.