సిద్దిపేట టౌన్, జూన్ 12: సిద్దిపేట సేవాపరులకు నిలయమని, మన పేరు ప్రపంచమంతటా వినిపిస్తున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 14 ఏండ్లుగా అమర్నాథ్లో అన్నదానం నిర్వహిస్తున్నారు. యాత్రికుల కోసం తరలి వెళ్లే ఆహార పదార్థాల వాహన పూజ, శివపార్వతుల కల్యాణం శరభేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి వైభవంగా జరిగింది. కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై కల్యాణంలో పాల్గొని,ఆహార పదార్థాల వాహనాన్ని జెండా ఊపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్నదానానికి మించిన దానం మరోటి లేదన్నారు.
హిమగిరుల్లో వెలిసిన అమర్నాథ్లో సిద్దిపేట వారు అన్నదానం చేయడం దైవ సంకల్పం అన్నారు.మనిషికి ఆస్తులు,అంతస్తులు కంటే సాయం చేయడంలోనే నిజమైన తృప్తి, ఆనందం కలుగుతుందన్నారు. ఇదే స్ఫూర్తిని సిద్దిపేట వారు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ సీనియర్ నేత రాధాకృష్ణశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చైర్మన్ చీకోటి మధుసూదన్, అధ్యక్షుడు కాచం కాశీనాథ్, గంజి రాములు, గోపిశెట్టి శరభయ్య, ఉప్పల భూపతి, లేఖ్‌రాజ్, అయిత రత్నాకర్, గంప శ్రీనివాస్, నందిని శ్రీనివాస్, పూజల వెంకటేశ్వర్లు, మంకాల నవీన్‌కుమార్, లక్ష్మన్, గందే ఈశ్వర్చరణ్ తదితరులు పాల్గొన్నారు.