చిన్నకోడూరు, డిసెంబర్ 26 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు రైల్వే స్టేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చిన్నకోడూరు, మాచపూర్, గంగపూర్ విఠలాపూర్ వరకు జరుగుతున్న రైల్వేలైన్, సాగు నీటి కాల్వల పనులను శుక్రవారం ఆయన క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కాల్వల్లో మట్టి పేరుకుపోయిందని, వచ్చే యాసంగిలోపు మట్టిని తొలిగించాలని అధికారులను ఆదేశించారు.
రైల్వేలైన్ క్రాసయ్యే క్రమంలో కాల్వల మీద రైల్వేబ్రిడ్జిల పనులు యాసంగిలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా రైల్వే, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, చిన్నకోడూరు సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడికాయల వెంకటేశం, ఉమేశ్‌చంద్ర, కాల్వ ఎల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.