సిద్దిపేట, నవంబర్ 21: రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నదని, నేటి ప్రపంచం స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ అంటూ అప్డేట్ అవుతున్నదని, ఇన్నోవేషన్‌కు ఆకాశమే హద్దు అని మాజీ మంత్రి,సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని బాలికల హైసూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆయన తిలకించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సైన్స్ఫెయిర్లతో నూతన ఆవిష్కరణలు వెలుగుచూస్తాయని తెలిపారు. నేటి విద్యార్థులు మంచి మంచి ఆవిషరణలు చేస్తున్నారని అభినందించారు. ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే మనం లేమన్నారు. కరెంట్, టెలిఫోన్ లాంటివి అన్నీ ఇన్నోవేషన్ నుంచి ఉద్భవించినట్లు తెలిపారు.
ఇన్నోవేషన్ నిరంతర ప్రక్రియ అన్నారు. కంప్యూటర్ పోయి ఏఐ వచ్చిందని, విద్యార్థుల నుంచి మరిన్ని గొప్ప ఆవిష్కరణలు వెలుగుచూడాలన్నారు. సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు.మనిషిలో ఉత్సాహం లేకపోతే ఓటమితో సమానం. మనిషిలో ప్రేరణ ఉత్సా హం ఉండాలన్నారు. సిద్దిపేటలో 1853 ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేశారని, మన రాష్ట్రంలో అత్యుత్తమ సైన్స్ ఫెయిర్ సిద్దిపేటకు వచ్చిందన్నారు.ఇస్రోకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. సిద్దిపేటకు జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరును తీసుకొని రావాలని, ఈ వైజ్ఞానిక ప్రదర్శన మీ అందరిలో మంచి ఉత్సాహం నింపాలని కోరుతున్నట్లు తెలిపారు. టెలిఫోన్ నుంచి ఫోన్ వచ్చిందని, సైన్స్ అనేది మన జీవితాన్ని మార్చేస్తుందన్నారు. మీరందరూ సిద్దిపేట పేరును నిలబెట్టాలని, ఈ సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించిన ఉపాధ్యాయులకు, సిబ్బంది, అందరినీ అభినందిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట టాప్‌లో ఉండాలన్నారు.
మీకెలాంటి సమస్యలు ఉన్న, తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులకు చాలా సమస్యలు ఉన్నాయని, డీఏలు రాలేదని, రిటైర్మెంట్ పైసలు రావట్లేదని, పీఆర్సీ రాలేదన్నారు. 33 జిల్లాలకు 33 మంది డీఈవోలు ఉండాలని, కానీ.. ముగ్గురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఐఏఎస్‌లను డీఈవోలుగా నియమించడం వల్ల ఏం ఉపయోగం అన్నారు. అన్ని సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విద్యార్థులు ఫోన్లు, టీవీలు బంద్ చేయాలని, పొద్దున్నే లేచి బాగా చదువుకోవాలన్నారు. మంచి ర్యాంకులు సాధించి మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పేర్లను, సిద్దిపేట పేరును నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.