దుబ్బాక, మార్చి 16: కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు అధ్వానంగా మారాయని, వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటమాడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శనివారం అఖిల్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించడం బాధేసిందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గురుకుల పాఠశాలను సందర్శించి తరగతి గదులు, డార్మెటరీ, బాత్రూమ్లను ఆయన పరిశీలించారు. 7వ తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. అఖిల్ ఆత్మహత్య యత్నానికి గల కారణాలు, గురుకులం లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నా రు.
ఆనంతరం ఆయన విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారులో గురుకుల, వసతి గృహాల్లో పేద విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు గుణాత్మక విద్యనందించి కంటికి రెప్పలా చూసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో గురుకుల, వసతి గృహాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అటు రైతులను, ఇటు పేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. బలహీన వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలపై సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో వసతి గృహాల నిర్వహణపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో తరుచూ సమీక్షా సమావేశాలు నిర్వహించేవారమని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హబ్షీపూర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడే ఆలోచన రావడమనేది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఏమాత్రం ఆలస్యమైనా అఖిల్ ప్రాణాలు పోయేవని, తోటి విద్యార్థులే అతడి ప్రాణాలు రక్షించారని తెలిపారు. నిలోఫర్‌లో అఖిల్‌కు అందుతున్న వైద్యంపై సంబంధిత వైద్యులతో శనివారం నుంచి ఎప్పడికప్పుడు మాట్లాడి తెలుసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురుకులాల్లో చదువుకునే బలహీన వర్గాల విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. వసతి గృహాన్ని చూసిన ఎమ్మెల్యే సిబ్బందిని నిలదీశారు. విద్యార్థులు చీకటి గదిలో చదువుకోవడం, గోదాం మాదిరిగా ఉన్నా ఒకే గదిలో విద్యార్థులంతా నిద్రించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూమ్లు అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందకపోవడంతో బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. హబ్షీపూర్ వసతి గృహం కారాగారం మాదిరిగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, బీఆర్ఎస్ నాయకులు కడతల రవీందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాజమౌళి, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, వంశీ తదితరులు ఉన్నారు.