జహీరాబాద్, జనవరి 23: చిరుధాన్యాల జాతర ప్రపంచంలో ఎక్కడా ఉండదని, కేవలం తెలంగాణలోని జహీరాబాద్లోనే నిర్వహిస్తారని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పీ.సతీశ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో డీడీఎస్ ఏర్పాటు చేసిన 23వ పాత పంటల జాతరను గనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు మాట్లాడారు. చిరుధాన్యాల పండగను ప్రజల మధ్య నిర్వహించి, పాత పంటల విత్తనాలు, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారి అభిప్రాయలు తెసుకుని జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు.
పాత పంటల జాతరలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావులు, రైతులు, మహిళా రైతులు పాల్గొని చిరుధాన్యాల సాగుపై మాట్లాడుతారన్నారు. కనుమరుగవుతున్న జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో వేయి విత్తనాలు కనుమరుగయ్యాయని, వాటిని కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉన్నదన్నారు. చిరుధాన్యాల్లో అధిక పోషకాలు ఉన్నాయని, వాటిని సంరక్షించేందుకు రైతులు కృషి చేయాలన్నారు. చిరుధాన్యాల సాగుతో జీవ వైవిధ్యాన్ని కాపాడే ఆవకాశం ఉంటుందన్నారు. విత్తనాలే తమకు దేవుళ్లని, అందుకే విత్తనాల పండగ నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయంలో చిరుధాన్యాలకు వ్యవసాయ శాఖ అధికారులు పెద్దపీట వేయాలని వారు కోరారు.
పూర్వం చిరుధాన్యాలే పేదల ఆహారం
పూర్వ కాలంలో చిరుధాన్యాలే పేదల ఆహారమని పూర్వీకులు తెలిపేవారని జహీరాబాద్ తహసీల్దార్ జే.స్వామి తెలిపారు. తన చిన్నప్పుడు ప్రతి ఇంట్లో చిరుధాన్యాలు ఉండేవన్నారు. చిరుధాన్యాల్లో పోషకాలు భారీగా ఉంటాయని, ప్రతిఒకరూ చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. చిన్నప్పుడు వస్తు మార్పిడి చేసి సంతలో వస్తువులు కొనుగోలు చేసే వారన్నారు. సజ్జలు, జొన్నలు అమ్మకాలు చేసి ఇంటికి కావాల్సిన ఇతర వస్తువులు కొనేవారన్నారు. ఇప్పుడు చిరుధాన్యాల కోసం గ్రామాలు తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. చిరుధాన్యాలను ధనికులు తినే పరిస్థితి వచ్చిందని, ప్రతిఒక్కరూ జొన్న రొట్టెలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
మార్కెట్లో చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. పలువురు అధికారులు మాట్లాడుతూ చిరుధాన్యాల సాగును కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. దేశంలో పాత పంటలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఎడ్లబండ్లకు పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. ప్రభుత్వం చిరుధాన్యాలకు మద్దతు ధర పెంచి, సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని పలువురు మహిళా రైతులు కోరారు. గిరిజన మహిళలు ఆటపాటలతో అధికారులకు స్వాగతం పలికారు.
అర్జున్ నాయక్తండాకు చెందిన చక్రిబాయి జీవవైవిధ్యం గురించి వివరించారు. జీవవైవిధ్య సంరక్షణ చేస్తున్న కాశీంపూర్కు చెందిన దండు బాలమ్మ, జాడి మాల్కాపూర్కు చెందిన సంగాపూర్ శ్యామలమ్మలను సన్మానించారు. ఈ జాతరలో జీవవైవిధ్యానికి సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేశారు. పాత పంటల జాతరలో వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, ఎంపీడీవో సుమతి, ప్రగతి నర్సింగ్ హోం వైద్యురాలు విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అస్లామ్ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.