వెల్దుర్తి, మార్చి 7: గత మూడు నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదని దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పంచాయతీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ మాసాయిపేట (Masaipet) గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో భిక్షాటన చేసి ప్రభుత్వానికి తమ గోసను తెలిపారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ.. డిసెంబర్ నెల నుంచి తమకు వేతనాలు రావడం లేదని దీంతో కుటుంబాల పోషణ ఇబ్బందికరంగా మారిందని వాపోయారు.
ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం మురికి, చెత్తలో పనిచేసే పంచాయతీ కార్మికులకు మాత్రం ఇవ్వడం లేదని వాపోయారు. తమపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు విధులను బహిష్కరిస్తున్నామని, ఏ పని కూడా చేసేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల వేతనాలను చెల్లించి ఆదుకోవాలన్నారు.