నిరుపేద కుటుంబానికి చెందిన నేను సర్కారు కొలువు కోసం ఏండ్ల తరబడి ఎదురు చూసిన. మా అమ్మానాయిన చాలా కష్టపడి నన్ను చదివించిండ్రు. సర్కారు కొలువు రావాలని వాళ్లు మొక్కని దేవుడు లేడు. నేను కూడా వారి ఆశయాన్ని నెరవేర్చాలని ఎంతో కష్టపడి చదివిన. పోలీస్ ఉద్యోగం చేయాలనే సంకల్పంతో ముందకు వచ్చాను. కానీ కొందరు పోలీస్ ఉద్యోగం అంటే చాలా కష్టమని, ఎన్నో పైరవీలు ఉంటాయని హేళన చేసిండ్రు. కానీ నేను అవి ఏవీ లెక్క జేయకుండా నమ్మకంతో చదివాను. 2020లో తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలు లేకుండా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం కౌడిపల్లిలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.
ఒకప్పుడు సర్కారు కొలువు అంటే శానా వరకు డబ్బున్న వారికి, పలుకుబడి ఉన్నోళ్లకే వచ్చేవి. దీంతో శానా మంది గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలను సదువుకోవడానికి పెద్దగా పంపించేవారు కాదు. ఎంత చదివినా సర్కారు కొలువు పేదోళ్లకు రాదనే అపవాదు ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ సార్ దయవల్ల ఆ అపవాదు తొలిగింది. మా ఊరుతో పాటు శానా ఊరల్లో నిరుపేదలు, అట్టడుగు వర్గాల వారికి కొలువు వచ్చాయని, కారణం తెలంగాణ సర్కారే అని మా పిల్లలు అంటున్నారు.
శానా కష్టపడి మా కొడుకును చదివించినం. నిరుపేద స్థితిలో ఉన్నా ఏనాడు బాధపడకుండా పెద్ద సదువులు సదివించినం. అప్పట్లో శానా మంది తెలంగాణలో కొలువులు రావని, ఆంధ్రోళ్లకే ఉద్యోగాలు వస్తాయని అంటుంటే. శానా బాధ అనిపించేది, కానీ ఏదో ఒక రోజు మనకు మంచి రోజులొస్తాయని నమ్మకం ఉండేది. ఆ నమ్మకం దేవుడు కేసీఆర్ దయ వల్ల నిజమైంది. జీవితాంతం ఆ సార్కు రుణపడి ఉంటాం.
కానిస్టేబుల్ ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. మా అమ్మనాన్నలు చాలా కష్టపడి చదివించారు. వ్యవసాయం చేసుకుంటూ నన్ను పోషించారు. ఉన్నత చదువులు చదివించే స్థోమత లేకున్నా నన్ను బాగానే చదివించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు మారుతాయని అంటే ఏమో అనుకున్నా. కానీ నిజంగానే మన బతుకులు మారుతున్నాయి. ప్రస్తుతం వెల్దుర్తిలో ఉద్యోగం చేస్తున్న. ఇదంతా సీఎం కేసీఆర్ దయ. సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
నా కొడుకు ఉద్యోగం కోసం ఎంతో ఖర్చు అయితందోనని శానా భయపడ్డా. ఎప్పు డు దిగులుగా ఉండేది. కానీ, పైసా ఖర్చు, పైరవీ లేకుండా కొలువు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం అయితే ఉద్యోగం వచ్చేది కాదేమో. ఎందుకంటే మా ఊర్లో శానా మంది సదువుకున్నోళ్లాను సుశిన. ఏండ్ల తరబడి సర్కారు కొలువుకు దరఖాస్తులు చేసేటోళ్లు. కానీ కొలువు వచ్చేది కాదు. దీంతో నాకు శానా సార్లు భయమేసేది. తెలంగాణ వచ్చాకే కేసీఆర్ సార్ దయవల్లే నా కొడుక్కు కొలువు వచ్చింది. గిప్పుడు శానా సంతోషంగా ఉంది.
తెలంగాణ సర్కారులో శానా మంది పేదోళ్ల పిల్లలకే ఉద్యోగాల్లో వచ్చాయని అంటున్నారు. శానా సంతోషంగా ఉంది. వ్యవసాయం చేసుకుంట పూటపూటకు కష్టపడి నా కొడుకును సదివించుకున్న. గి దినాంలో మీవోడికి సర్కారు నౌకరి వస్తదా.. అని శానా మంది ఎతిరేకం చేసేటోళ్లు. సర్కారు కొలువు రావాలంటే పైసలు లేనిదే రాదనేటోళ్లు. కానీ నా కొడుకు అమ్మా.. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, ఉద్యోగాలు వస్తాయని పదేపదే చెప్పేటోడు. గిప్పుడు అదే నిజమైంది. మావోడికి సర్కారు నౌకరి వచ్చింది. గిదంతా.. కేసీఆర్ సార్ పుణ్యమే..